కూలీ : ఆ వార్తల్లో నిజం లేదంటున్న అమీర్..!

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో దక్షిణ భారత భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. రజినీపై గౌరవంతోనే ఈ సినిమాలో నటించానని, కథ ఏమిటో కూడా తనకు తెలియదని అమీర్ చిత్ర ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు.

అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ క్లిప్ వైరల్ అవుతోంది. అందులో అమీర్ తన పాత్ర డిజైన్ పట్ల నిరాశ వ్యక్తం చేశాడని, ఆ పాత్రకు అసలు ప్రాధాన్యతే లేదని చెప్పినట్లు చూపిస్తున్నారు. కానీ నిజానికి అమీర్ అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. రజినీ, అమీర్ పేరును దెబ్బతీయాలని ప్రయత్నించే కొందరు కావాలనే ఈ తప్పుడు వార్తను స్ప్రెడ్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్, రచితా రామ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

Exit mobile version