‘సంచారి’ రిలీజ్‌తో SSMB29 పై సరికొత్త బజ్

యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB29 బిగ్గెస్ట్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 నుండి రాబోయే అప్డేట్స్ కోసం అందరూ ఆతృతగా చూస్తున్నారు.

ఇక ఈ వేడుకకు ఇంకో ఐదు రోజులే మిగిలి ఉంది. అయితే, అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమా నుండి తాజాగా ‘గ్లోబ్ ట్రాటర్’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మహేష్ ఫ్యాన్స్‌తో పాటు అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను శ్రుతి హాసన్ పాడటం విశేషం. చైతన్య ప్రసాద్ అందించిన ఈ పాట లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, ఇందులో ‘సంచారి’ అంటూ హీరో పాత్రను వివరించారు.

దీంతో ఇప్పుడు అభిమానుల్లో ఈ చిత్ర టైటిల్ పై మరో కొత్త చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పెడతారని ఇప్పటికే బజ్ ఉండగా.. ఇప్పుడు ‘సంచారి’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ బిగ్గెస్ట్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో శ్రుతి హాసన్ ఈ పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది.

Exit mobile version