విక్టరీ వెంకటేష్ ప్రజెంట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మార్చి నెలలోనే 70 శాతం షూటింగ్ ముగియగా లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. సుమారు 6 నెలల తరవాత టీమ్ ఈరోజే హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఎక్కువమంది క్రూతో బయటి ప్రాంతాల్లో షూట్ చేయడం రిస్క్ అనుకున్న టీమ్ హైదరాబాద్లోనే తగిన ఏర్పాట్లు చేసుకుని చిత్రీకరణ జరుపుతున్నారు.
ఇందులో వెంకీ సహా ముఖ్యమైన నటీనటులంతా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ కొత్త షెడ్యూల్ పూర్తైతే 80 శాతం షూటింగ్ ముగిసినట్టే. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. ‘అసురన్’ చూసి బాగా ఇంప్రెస్ అయిన వెంకటేష్ పట్టుబట్టి మరీ ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం మీద ఆయన చాలా అంచనాలే పెట్టుకున్నారు. తనలోకి నటుడికి ఇదొక ఈ సినిమా ఒక ఛాలెంజ్ అనుకుని చేస్తున్నారు.