నాచ్యురల్ స్టార్ నాని కొత్తగా సైన్ చేసిన సినిమాల్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ చిత్రం కూడ ఒకటి. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్నారు. వివేక్ ఆత్రేయ గత చిత్రాలు ‘బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో’ చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కోసం నాని తన రెగ్యులర్ స్టైల్ ను వదిలి కొంచెం భిన్నంగా ట్రై చేస్తున్నారట.
అదే పూర్తిస్థాయి కామెడీ కంటెంట్ కు ఓకే చెప్పడం. ఈ సినిమాలో కామెడీ టచ్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారట డైరెక్టర్. ఆయన ఇప్పటివరకు చేసిన రెండు సినిమాల్లోనూ ఎంటర్టైన్మెంట్ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. వాటి తరహాలోనే ఈ సినిమా కూడ ఉంటుందని తెలుస్తోంది. సినిమా టైటిల్ కూడ ‘బ్రోచేవారెవరురా’ తరహాలోనే అచ్చ తెలుగు పాపులర్ సామెత నుండి తీసుకునే పెడుతున్నారట. నవంబర్ 21న టైటిల్ ఏమిటో రివీల్ చేయనున్నారు.
ఇందులో మలయాళ స్టార్ నటి నజ్రియా కథానాయకిగా నటించనుంది. నజ్రియా తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. 2013లో వచ్చిన తమిళ చిత్రం ‘రాజా రాణి’ తెలుగులోకి కూడ డబ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. అందులో నజ్రియాను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె తెలుగులో కూడ సినిమాలు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఆమె పూర్తిగా తమిళ, మలయాళ సినిమాలకే పరిమితమై ఇన్నేళ్ల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నారు.