సూపర్ స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్లో ఉండగా అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే చిత్ర బృందం ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు రక్తపోటులో తేడా వలనే అస్వస్థకు గురైనట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం ఆయన్ను పర్యవేక్షిస్తోంది. రెండు రోజుల క్రితమే ‘అన్నాత్తే’ చిత్రం బృందంలో కొందరికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రజినీ ఉన్నట్టుండి అనారోగ్యం చెందడంతో ఆయన అభిమానులతో పాటు సన్నిహితులైన సినీ ప్రముఖులు కంగారుపడిపోయారు .
అపోలో యాజమాన్యం రక్తపోటులో తేడా మినహా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, కోలుకుంటున్నారని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరూ రజినీ గురించి వాకబు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రజినీకి అత్యంత ఆప్తుడు డాక్టర్ మంచు మోహన్ బాబు. హైదరాబాద్లో రజినీకి ఇలా అయిందని తెలియడంతో తిరుపతిలో ఉన్న ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే రజినీ కుమార్తెకు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలను కనుక్కుని అంతా బాగానే ఉందని తెలియడంతో కుదుటపడ్డారు. రజినీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అని, ఆ అస్వస్థత నుండి ఆయన త్వరగా కోలుకుని ఎప్పటిలా తన పనులు మొదలుపెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.