ఈ సంవత్సరం తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మామూలుగా అవార్డ్ వేడుకలకి దూరంగా ఉండే మహేష్ బాబు ఇటీవలే హైదరాబాద్లో జరిగిన సినీ’మా’ అవార్డ్స్ వేడుకలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ షాక్ నుంచి కోలుకొనేలోగా మహేష్ బాబు మరో షాక్ ఇవ్వనున్నారు. తాజా సమాచారం ప్రకారం జూలై 7న చెన్నైలో జరగబోయే సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి హాజరు కాబోతున్నారు. సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ‘దూకుడు’ చిత్రానికి గాను ఉత్తమ నటుడు విభాగంలో మహేష్ బాబు ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు విభాగంలో ‘దూకుడు’ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మరియు ఉత్తమ కథా రచయిత విభాగంలో ఈ చిత్ర కథా రచయిత కోన వెంకట్ ఎంపికయ్యారు.
” సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తన ఇష్ట దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి జూలై 7న చెన్నైలో జరగబోయే సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి హాజరు కాబోతున్నానని స్వయంగా కోన వెంకట్ గారే తన ట్విట్టర్లో పేర్కొన్నారు”. మహేష్ బాబు, సమంత జంటగా నటించిన ‘దూకుడు’ చిత్రం ఈ సంవత్సరం అన్ని అవార్డ్స్ వేడుకల్లోనూ ముఖ్యమైన అన్ని విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంటోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినీ’మా’ మరియు సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడు అవార్డ్స్ గెలుచుకున్న మహేష్ బాబు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా గెలుచుకుంటారని ఆశిద్దాం.