సీనియర్ నటి శోభనకి ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. పైగా, ‘కల్కి’ సినిమా తర్వాత ఆమె ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ఆమె ముచ్చటించారు. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను నెటిజన్లతో శోభన పంచుకోవడం విశేషం. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తో ‘కల్కి 2898 ఏడీ’ లో వర్క్ చేయడంపై శోభన స్పందిస్తూ.. ‘అమితాబ్ బచ్చన్ ఎంతో మంచి వ్యక్తి. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఆయన ఏమీ మారలేదు. మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన గురించి మీ అందరికీ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు.
ఇంతకీ, శోభన ఏం మాట్లాడారు అంటే.. ‘కల్కి’ కంటే ముందు ఎన్నో ఏళ్ల క్రితం అమితాబ్ తో నేనొక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశాను. ఆయన హీరోగా నటించిన సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ చేశా. సాంగ్ షూటింగ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఆ ఒక్క సాంగ్‌లోనే నేను చాలా కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సి ఉంది. మరోవైపు షూట్‌లో భాగంగా నేను దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది. అంతలో ఓ వ్యక్తి.. ‘‘ఆమె కేరళ నుంచి వచ్చారు. అక్కడివాళ్లు దేనికైనా సర్దుకుపోతారు. కాబట్టి ఆమె చెట్ల వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకుంటుందిలే’’ అని అన్నారు. వెంటనే అమితాబ్ అతడిని తిట్టి, తన కారవాన్‌ను నాకు ఇచ్చారు’ అని శోభన తెలిపారు.