సీనియర్ నటీనటులకు కమిట్మెంట్ ఎక్కువ. పెద్దగా సాంకేతిక సదుపాయాలు లేని సమయంలోనే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన స్టార్ హీరోలున్నారు. ఆ కష్టపడే తత్వమే వారిని స్టార్లుగా నిలబెట్టి ఇప్పటికీ యువ నటులతో పోటీపడేలా చేస్తోంది. సీనియర్ నటీనటులు తమకంటే ముందు నిర్మాతల గురించే ఎక్కువగా కేర్ తీసుకుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వలన నిర్మాతలు ఇబ్బందులు పడకూడని భావిస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన ఆయన 70 ఏళ్ళ వయసు వచ్చినా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ఆయన వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ‘ది కాశ్మిర్ ఫైల్స్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముస్సోరీలో జరుగుతోంది. అయితే ఈరోజు ఆయన షూటింగ్ స్పాట్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారట. ఆయన మీద ఒక భారీ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తుండగా నిల్చున్న చోటే కళ్ళు తిరిగి పడిపోయారట. ఫుడ్ పాయిజన్ కావడం మూలానే అలా జరిగిందని, కాసేపటి తర్వాత ఆయన కోలుకున్నారని చెప్పుకొచ్చారు డైరెక్టర్. అంతేకాదు లేచిన వెంటనే కెమెరా ముందుకు వచ్చి అప్పటికే అన్ని సిద్ధం చేసుకుని ఉన్న సన్నివేశాన్ని కంప్లీట్ చేశారట. సీన్ పూర్తయ్యాక షూటింగ్ ఆలస్యం కాలేదు కదా అని పదే పదే అడిగారట. అలాంటి పరిస్థితుల్లో కూడ ఆయన కమిట్మెంట్ చూసి ఆశ్చర్యం వేసిందని వివేక్ అగ్నిహోత్రి చెప్పుకొచ్చారు.