రేడియో మిర్చీ వారు 2011కు సంభందించిన రేడియో మిర్చీ అవార్డ్స్ వేడుకని ఆగష్టు-04న హైదరాబాద్లో జరపనున్నారు. ఈ విశేషాలను తెలియజేయడం కోసం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేడియో మిర్చీ సిఇవో ప్రశాంత్ పాండే మాట్లాడుతూ ‘ సౌత్ ఇండియన్ చలన చిత్ర రంగాలైన తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషలలో విడివిడిగా సంగీతానికి సంభందించిన 13 విభాగాల్లో అవార్డ్స్ అందించబోతున్నామన్నారు. అలాగే తమ సంగీతంతో ప్రపంచానికి ఎంతో సేవ చేసిన వారికి ఒక్కొక్క భాషలో ఇద్దరి చొప్పున ‘జీవన సాఫల్య పురష్కారం’ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. రేడియో మిర్చీ శ్రోతల ఓటింగ్ ద్వారా నలుగు భాషల్లోనూ ‘ఈ సంవత్సరపు ఉత్తమ పాట’ మరియు ‘ఈ సంవత్సరపు ఉత్తమ ఆల్బమ్’లకు కూడా అవార్డు ప్రధానం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు’.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ ‘ మన దేశంలో సంగీతానికి ఎంతో మంచి ప్రాధాన్యం ఉందని, ఇప్పటివరకూ సంగీతం అనే ఒక్క విభాగం కోసమే ఇలాంటి ప్రత్యేకమైన అవార్డ్స్ కార్యక్రమం చేయడం అరుదుగా జరుగుతుంటాయని, అలాంటి కార్యక్రమాన్ని మిర్చీ వారు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మరియు దీనివల్ల సంగీతం యొక్క విలువ మరియు గుర్తింపు పెరుగుతుందని ఆయన అన్నారు’. తనికెళ్ళ భరణి, ఆర్.పి పట్నాయక్, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, రమణ గోగుల, సునీత మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.