శ్రీమతి పులిజాల నరసమ్మ సమర్పణలో, పులిజాల ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ‘రాబందు’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జయశేఖర్ కల్లు దర్శకత్వం వహించగా, పులిజాల సురేష్ నిర్మించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రైలర్‌ను లాంఛనంగా విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
అనంతరం, దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్‌ను, నటి ప్రీతి నిగమ్ టీజర్‌ను విడుదల చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులు ఉపేంద్ర, రేణుకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు జయశేఖర్ తనకు ఇది నాలుగో సినిమా అని, నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. నిర్మాత సురేష్ మంచి కథతో, సందేశాత్మకంగా సినిమాను బాగా తెరకెక్కించారని ప్రశంసించారు.
నటి ప్రీతి నిగమ్ మాట్లాడుతూ, ట్రైలర్ అద్భుతంగా ఉందని, రాబందు పక్షి పట్టుదల సినిమాలో కూడా కనిపిస్తుందని చెప్పారు. సినిమా కోసం ఎంతో ధైర్యంగా కష్టార్జితాన్ని వెచ్చించిన నిర్మాత సురేష్‌ను అభినందించారు. ఇది మంచి చిత్రమని, ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమాను ఆదరించాలని ఆమె కోరారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని దర్శకుడు సముద్ర ఆకాంక్షించారు.
