ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగస్టు 7, 2025
స్ట్రీమింగ్ వేదిక : సోనీ లివ్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
నటీనటులు : ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్య దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శత్రు తదితరులు
దర్శకత్వం : దేవా కట్టా, కిరణ్ జేయ్ కుమార్
నిర్మాతలు : జయ్ కృష్ణ, లింగమనేని, శ్రీ హర్ష
సినిమాటోగ్రఫీ : సురేష్ రగుటు, జ్ఞానశేఖర్ వి.ఎస్
సంగీతం : శక్తికాంత్ కార్తిక్
ఎడిటర్ : ప్రవీణ్ కె.ఎల్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
పొలిటికల్ థ్రిల్లర్స్‌ను హ్యాండిల్ చేయడంలో దర్శకుడు దేవా కట్టా ఎక్స్‌పర్ట్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా ‘మయసభ’ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఆంధ్రప్రదేశ్‌లోని పులిచర్లకు చెందిన ఇద్దరు విద్యావంతులు కాకర్ల కృష్ణమ నాయుడు(KKN), ఎంఎస్ రామి రెడ్డి(MSR)ల జీవితకథే ఈ ‘మయసభ’ వెబ్ సిరీస్. కొన్నేళ్ల తర్వాత వారిద్దరు మళ్లీ కలుస్తారు. ఈసారి వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకుంటారు. వేర్వేరు కులాలు, నేపథ్యాలు, ఆలోచనలతో ఉన్నా ఈ ఇద్దరూ రాజకీయాల్లో కీలక నాయకులుగా ఎదుగుతారు. అయితే, కొన్ని కారణాల వల్ల వారిద్దరి దారులు వేరవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది..? రాయపాటి చక్రధర్ రావు ఎవరు(RCR).. ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు..? ఈ ఇద్దరు స్నేహితులతో RCRకు ఎలాంటి కనెక్షన్ ఉంది..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ ఎప్పటికీ ఆకట్టుకుంటుంది. ఇందులోని ట్విస్టులు, మలుపులు, ద్రోహం, లక్ష్యం, త్యాగం తదితర అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. నచ్చినా నచ్చకపోయినా రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. దేవా కట్టా ఈ అంశాన్ని చక్కగా అవలంబిచుకుని, ఆసక్తికర పొలిటికల్ డ్రామాను తీర్చిదిద్దారు.
ఆయన రైటింగ్, కథనంలోని లోతు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఓ రాజకీయ కథలో ఏం చెప్పాడని కాదు.. దానిని ఆయన ఎలా చెప్పాడు అనేది మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
ఇలాంటి పొలిటికల్ కథలకు చక్కటి క్యాస్టింగ్ కూడా తోడుకావాలి. ఈ విషయంలో దర్శకులు మంచి మార్క్ చూపెట్టారు. రామి రెడ్డిగా చైతన్య రావు, కృష్ణమనాయుడు గా ఆది పినిశెట్టి పర్ఫెక్ట్‌గా సరిపోయారు. సాయి కుమార్, చక్రధర రావు కూడా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు.
ఆది, చైతన్య రావు తమ పాత్రల్లో జీవించారని చెప్పాలి. వారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక కీలక సన్నివేశాలను సాయి కుమార్ హ్యాండిల్ చేసిన తీరు అద్భుతం.
‘మేడమ్’ అనే పాత్రలో దివ్య దత్తా అదరగొట్టింది. సిరీస్‌లోని పాత్రలకు మరింత డెప్త్ తీసుకురావడంలో ఆమె పాత్ర తోడ్పడింది. నాజర్ మీడియా లెజెండ్ శివాజీ రావు పాత్రలో, చేవెళ్ల బాబు రావు పాత్రలో శ్రీకాంత్ భరత్, పోతినేని రమేష్ అనే నక్సలైట్ పాత్రలో రవీంద్ర విజయ్, నటి అను హారిక పాత్రలో తాన్య రవిచంద్రన్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
ఈ సిరీస్‌లోని కొన్ని సీన్స్ ప్రేక్షకులపై పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించాయి. ముఖ్యంగా RCR తన కొత్త రాజకీయ పార్టీని పెట్టడం వంటి సీన్స్ కట్టిపడేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఆద్యంతం ఆకట్టుకునేలా సాగే ఈ సిరీస్‌లో లోపాలు కూడా ఉన్నాయి. సిరీస్ మధ్యలో ఈ వెబ్ సిరీస్ రైటింగ్ చాలా చప్పగా సాగుతుంది. ముఖ్యంగా భారత్‌లో ఎమర్జెన్సీ వంటి సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోవు. స్లో పేస్‌తో సాగే ఈ సీన్స్ ప్రేక్షకులను అలరించవు.
దేవా కట్టా ఇదొక ఫిక్షన్ కథ అని చెప్పినా, ప్రేక్షకులు ఇందులోని పాత్రలు, సన్నివేశాలకు నిజజీవితంలోని వాటికి ఇట్టే కనెక్ట్ అవుతారు. ఇది కొంతవరకు వివాదాన్ని రేపే అవకాశం ఉంది.
మయసభలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు, కొన్ని బోల్డ్ డైలాగులు ఉన్నాయి. ఇవి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కావు. శత్రు, రవీంద్ర విజయ్ లాంటి యాక్టర్స్ పాత్రలకు పూర్తి న్యాయం చేయలేదు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
ఈ సబ్జెక్ట్‌ను దేవా కట్టా అండ్ టీమ్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎవరికీ పక్షపాతం చూపకుండా అన్ని పాత్రలను బాగా డీల్ చేశారు. అయితే, మరికొంత బెటర్ రైటింగ్‌పై టీమ్ ఫోకస్ చేయాల్సింది. సురేష్ రగుటు, జ్ఞానశేఖర్ విఎస్ కెమెరా పనితనం అదిరిపోయింది. అలనాటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. ఆర్ట్ డిజైన్ వర్క్ బాగుంది. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చాలా వరకు బాగున్నా, కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. శక్తికాంత్ కార్తిక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘మయసభ’ ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. చైతన్య రావు, ఆది పినిశెట్టి తమ పర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేస్తారు. ఇందులో థ్రిల్లింగ్ అంశాలు, కథలో ట్విస్టులకు లోటు లేదు. అయితే, కొన్ని ఎపిసోడ్స్ చాలా సాగదీతగా సాగడం మైనస్. పేస్ కూడా చాలా చోట్ల ట్రాక్ తప్పింది. కొన్ని డైలాగులు, హింసాత్మక సన్నివేశాలు మెప్పించవు. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఇలాంటి థ్రిల్లింగ్ సిరీస్‌ను తప్పకుండా చూడాలి.
123telugu.com Rating: 3.5/5
Reviewed by 123telugu Team