చెట్లని మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా “కలివి వనం”. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది.
ఈ సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై. జె రాంబాబు , గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యురీ మెంబెర్ లక్ష్మి నారాయణ, సినీజోష్ సీఈఓ రాంబాబు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, దుష్చర్ల సత్యనారాయణల చేతుల మీదుగా చిత్ర టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.
అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ.. “నేను ఈ చిత్రానికి మ్యూజిక్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ అన్నకు, ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డికి థ్యాంక్స్. నేను ఎక్కువగా మాట్లాడకున్నా, నేను కంపోజ్ చేసిన టీజర్ మాట్లాడుతుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేశానని భావిస్తున్నా. నేను రిక్వెస్ట్ చేయగానే పాట రాసిన కాసర్ల శ్యామ్ అన్నకు థ్యాంక్స్”. అన్నారు.
అలాగే నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ..”దర్శకుడు రాజ్ లాగే నాకు కూడా చెట్లంటే ఇష్టం. అందుకే “కలివి వనం” సినిమాను రూపొందించాను. ఈ రోజు మా సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక చిన్న ఐడియాగా మొదలైన ఈ మూవీ ఈ రోజు ఇంత బాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం హ్యాపీగా ఉంది”. అన్నారు.
ఇక నిర్మాత విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ..”ఈ రోజు మా “కలివి వనం” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ల సపోర్ట్ తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ మా మూవీ టీమ్ తరుపున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అని తెలిపారు.
నటి బలగం విజయలక్ష్మి మాట్లాడుతూ..”వనాలను కాపాడుకోవాలి, జనాలను రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నాకొక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించి చెట్లను కాపాడాలని కోరుతున్నా” అన్నారు.
దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ.. “కలివి వనం” టీజర్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా చిత్రాన్ని కమర్షియల్ మూవీ కాదు అంటున్నారు కానీ వందశాతం మాది కమర్షియల్ చిత్రమే. పిల్లల నుంచి పెద్దల దాకా చూడాల్సిన సినిమా. మనం వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే ఆకాశం నుంచి అని చెబుతాం. కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. ప్రేక్షకుల మనసులను తాకే చిత్రమిది. మీ హృదయాలకు చేరువవుతుంది. అలాంటప్పుడు మాది పూర్తిగా కమర్షియల్ చిత్రమే. నేను యూట్యూబ్ లో 300 పాటలు రూపొందించాను. దర్శకుడిగా ఇది నాకు మూడో సినిమా. మా కాసర్ల శ్యామ్ అన్నతో ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది. నాగ దుర్గ ఫోక్ సాంగ్స్ చూడండి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఆమెను నా మూవీలో తీసుకున్నా. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవి గా మార్చిన దుష్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితోనే “కలివి వనం” చిత్రాన్ని రూపొందించాను” అని తెలిపారు.