మహేష్ బాబు మరియు సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం చాలా రోజుల తరువాత చిత్రీకరణ మొదలు పెట్టుకుంది కొన్ని నెలల క్రితం ఈ చిత్రం కోసం ఒక పాటను చిత్రీకరించారు తరువాత మహేష్ బాబు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చారు. ప్రస్తుతం ఆ చిత్రంలో చాలా భాగం పూర్తి అయ్యింది కాబట్టి మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్ర తరువాత షెడ్యూల్ అక్టోబర్ 10 నుండి గోవాలో మొదలు కానుంది. ఆసక్తికరంగా మహేష్ బాబు గత చిత్రం “బిజినెస్ మాన్” కూడా గోవాలో చిత్రీకరించారు. సుకుమార్ మరియు మహేష్ బాబు మొదటి సారి కలిసి చిత్రం చేస్తుండటంతో చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రానికి వైవిధ్యమయిన సంగీతం అందిస్తానని మాట ఇచ్చారు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ ని ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది.