పరిశ్రమ నిలబడాలంటే చిన్న సినిమాలు బ్రతకాలి అంటారు. నిజానికి స్మాల్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ కి పరిశ్రమలో ఉండే కష్టాలు అంతా ఇంతా కాదు. సినిమా పూర్తియిన తరువాత దాని విడుదల కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. విడుదలకు అయ్యే ఖర్చు ఒకెత్తయితే, థియేటర్స్ దొరకడం మరొక ఎత్తు. ఏళ్ల తరబడి ఎదురుచూసినా సినిమా విడుదలకు నోచుకోక బాక్సులకే పరిమితమైన చిన్న సినిమాలు అనేకం.
భవిష్యత్తు చిన్న సినిమాలకు ఇంకా కఠినంగా మారే అవకాశం కనిపిస్తుంది. కరోనా కారణంగా అరడజనుకు పైగా పెద్ద సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఉండిపోయాయి. లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్న సినిమాలు సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత విడుదలకు పోటీ పడడం ఖాయం. దీనితో సమీప కాలంలో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీనివలన పరిశ్రమలో తెరకెక్కిన చాల చిన్న సినిమాల విడుదల ఇప్పట్లో ఉండకపోవచ్చు.