భారతీయ చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి, ‘బాహుబలి – ది ఎపిక్ 2025’ పేరుతో ఈ నెల 31న ఒకే చిత్రంగా విడుదల చేస్తున్నారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పూర్తి చేసిన ఈ ప్రత్యేక ఎడిషన్ రన్ టైమ్ వివరాలు కూడా ఖరారయ్యాయి. అయితే, ఈ వినూత్న ఆలోచన ఏడేళ్ల క్రితమే ఒక పారిశ్రామిక దిగ్గజం మస్తిష్కం నుంచి వచ్చిందంటే ఆశ్చర్యమే!
లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు, ‘బాహుబలి 2’ విడుదలైన వారం రోజుల తర్వాత, అంటే మే 6, 2017న దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. “బాహుబలి పార్ట్ 1, 2 లను కలిపి ఎడిట్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేయండి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. దీని ద్వారా మళ్లీ కనీసం రూ. 500 కోట్లు కలెక్షన్లు రాబట్టవచ్చు,” అని ఆయన తన ముందుచూపును పంచుకున్నారు.
తన వ్యాపార సామర్థ్యాలతో ఎదిగిన విక్రం నారాయణరావు గారి ఈ దూరదృష్టితో కూడిన ఆలోచన ఇప్పుడు నిజమవుతోంది. ఏడేళ్ల క్రితమే సినీ రంగంలో ఇంతటి అసాధారణమైన విజన్ కలిగి ఉన్నందుకు ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.



