సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది

little-hearts

విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగారం, రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్య కృష్ణన్, ఎస్ ఎస్ కంచి, జై కృష్ణ తదితరులు
దర్శకుడు : సాయి మార్తాండ్
నిర్మాతలు : ఆదిత్య హాసన్
సంగీత దర్శకుడు : శింజిత్ యర్రమిల్లి
సినిమాటోగ్రాఫర్ : సూర్య బాలాజీ
ఎడిటర్ : శ్రీధర్ సోంపల్లి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సోషల్ మీడియాలో తన వీడియోస్ తో వైరల్ గా మారిన నటుడు మౌళి తనూజ్ వెండితెర అరంగేట్రం చేస్తూ వచ్చిన సినిమా “లిటిల్ హార్ట్స్” కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తమ తల్లిదండ్రులు కోరిన చదువులు చదవలేక, చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని ఇద్దరు యువతీ యువతులు అఖిల్ (మౌళి తనూజ్ ప్రశాంత్) అలాగే కాత్యాయని (శివాని నాగారం) ఒక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కి జాయిన్ అవుతారు. అక్కడ నుంచి ఇద్దరికీ జరిగిన పరిచయం తర్వాత వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది? ఆల్రెడీ ఒక బ్రేకప్ తర్వాత కాత్యాయనిని ప్రేమించిన అఖిల్ ఆమె విషయంలో తెలుసుకున్న ఓ షాకింగ్ నిజం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు వీరి ప్రేమని అంగీకరించారా లేదా? ఇంకోపక్క వీళ్ళ చదువులు ఏమయ్యాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

90స్ బయో పిక్ ఇంకా మౌళి విషయంలో మినిమమ్ అవగాహన మన తెలుగు యువతకి ఇపుడు బాగానే ఉండి ఉంటుంది. వారిని అయితే మౌళి ఎక్కడా డిజప్పాయింట్ చేయడని చెప్పాలి. తన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా డీసెంట్ అండ్ ఫన్నీగా ఉందని చెప్పాలి. తన నుంచి సాలిడ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది.

ముఖ్యంగా సెకండాఫ్ లో తనపై ఓ సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలేరియస్ గా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. అలాగే తనకి జోడిగా నటించిన యంగ్ హీరోయిన్ శివాని నాగారం అంబాజీపేట మ్యారేజి బ్యాండు తర్వాత తనకి సూటయ్యే మరో రోల్ ని ఎంచుకుంది. ఇందులో ఆమె పర్ఫెక్ట్ గా కనిపించడమే కాకుండా పలు టైం లైన్స్ తగ్గట్టుగా ఆమె తన లుక్స్ ఇంకా నటనతో ఇంప్రెస్ చేస్తుంది.

ఇక వీరితో పాటుగా మౌళి తోనే కనిపించే మరో యువ నటుడు జై కృష్ణ మరో ఎసెట్ అని చెప్పాలి. సాలిడ్ కామెడీ టైమింగ్ అండ్ మంచి నటనతో ఈ యువ నటుడు ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ సెకండాఫ్ లలో తనపై పలు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి.

ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల తన రోల్ లో అదరగొట్టారు. తన కొడుకు చదువు విషయంలో ఆరాట పడే తండ్రిగా కుటుంబ పెద్దగా మంచి రోల్ లో కనిపించారు. అలాగే నటుడు ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇక వీటితో పాటుగా కథనం సెకండాఫ్ లో బెటర్ గా అనిపించింది. పెద్దగా బోర్ లేకుండా పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్ సినిమా సాగింది అని చెప్పవచ్చు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో బలమైన స్టోరీ లైన్ అయితే లేదు చాలా సింపుల్ లైన్ నే అందరికీ తెలిసిన దానినే అలా ఫన్ సీన్స్ తో లాగించేసారు. సో మరీ కొత్తదనం కోరుకునేవారు ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్ అవుతారు. అలాగే అక్కడక్కడా కథనం ఒకింత సాగదీత ఫీల్ కలుగుతుంది.

అలాగే కామెడీ సీన్స్ కొన్ని బాగానే ఉన్నప్పటికీ రిపీటెడ్ గా అనిపిస్తాయి సో వాటితో కొంచెం అక్కడక్కడా మాత్రం ల్యాగ్ అనిపించవచ్చు. అలాగే సినిమా టైం లైన్ ఒక పదిహేనేళ్ల వెనక నుంచి తీసుకున్నారు కానీ టెక్నికల్ గా ఆ టైం డీటెయిల్స్ మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది.

అలాగే కథనం కూడా చాలా వరకు ఊహాజనితంగానే కనిపిస్తుంది. సో మరీ ట్విస్ట్ లు టర్న్ లు లాంటివి కూడా ఈ సినిమా నుంచి ఆశించకుండా ఉంటే మంచిది. అలాగే సినిమాలో మొత్తం కామెడీకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మంచి ఎమోషన్స్ లాంటివి ఫ్యామిలీ విషయంలో కోరుకునేవారికి ఈ చిత్రంలో అంతగా కనిపించవు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆదిత్య హాసన్ పెట్టుకున్న బడ్జెట్ కి తగ్గట్టుగా డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్ తో సినిమాని బాగానే ప్లాన్ చేసుకున్నారు. శింజిత్ యర్రమిల్లి ఇచ్చిన సంగీతం బాగుంది. పాటలు, స్కోర్ డీసెంట్ గా ఉన్నాయి. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు సాయి మార్తాండ్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ చిత్రానికి ఓకే అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోయినప్పటికీ కామెడీ ట్రాక్స్ వరకు తాను బాగా రాసుకున్నారు. కానీ మిగతా అంశాలు అన్నీ చాలా సింపుల్ గానే నడిపించేసారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “లిటిల్ హార్ట్స్” ఒక డీసెంట్ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మౌళి ఒక డీసెంట్ డెబ్యూ ఇవ్వగా తన కామెడీ ట్రాక్స్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ లు బాగున్నాయి. ముఖ్యంగా యువతకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. లాజిక్స్, ఎమోషన్స్ తో పెద్దగా పని లేదు కేవలం ఫన్ కోసం మాత్రమే అంటే ఈ చిత్రాన్ని ట్రై చేస్తే ఎంటర్టైన్ అవుతారు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

 

Exit mobile version