ఓటీటీ సమీక్ష : కొల్లా – ఈటీవీ విన్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ సమీక్ష : కొల్లా – ఈటీవీ విన్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Published on Jun 19, 2025 6:49 PM IST

స్ట్రీమింగ్‌ తేదీ : జూన్ 19, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రజీషా విజయన్, ప్రియా ప్రకాశ్ వారియర్, వినయ్ ఫోర్ట్, కొల్లం సుధి తదితరులు
దర్శకత్వం : సూరజ్ వర్మ
నిర్మాత : రజీష్ కె.వి.
సంగీతం : షాన్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : రాజవేల్ మోహన్
ఎడిటర్ : అర్జు బెన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ & హైస్ట్ థ్రిల్లర్ చిత్రం ‘కొల్లా’ తెలుగు డబ్బింగ్‌తో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. రజీషా విజయన్, ప్రియాప్రకాశ్ వారియర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
అనీ(రజీషా విజయన్), శిల్ప(ప్రియాప్రకాశ్ వారియర్) కొత్తగా ఓ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయాలని చూస్తారు. వారు అద్దెకు తీసుకున్న షాపు పైన ఉన్న బ్యాంక్‌లో భారీ బంగారం దొంగతనం జరుగుతుంది. దీంతో ఈ బంగారం దొంగతనం కారణంగా వారి షాపును పోలీసులు మూసేస్తారు. ఇంతకీ ఈ బంగారం దొంగతనం చేసింది ఎవరు..? అనీ, శిల్ప ఈ దొంగతనం కేసులో ఎందుకు ఇరుక్కుంటారు..? వారికి తోడుగా ఎవరెవరు ఉంటారు..? పోలీసులు ఈ కేసును చేధిస్తారా..? దొంగలించబడ్డ బంగారం దొరుకుతుందా..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
మలయాళంలో ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు చాలా వచ్చాయి. అయితే, ఈ మూవీ సింపుల్ కథతో, చక్కటి పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దొంగతనమే లక్ష్యంగా ఇద్దరు అమ్మాయిలు వేసే ప్లాన్స్ ఆకట్టుకుంటాయి. ఎవరికీ అనుమానం రాకుండా వారు అనుకున్న పనిని ఎంత చాకచక్యంగా చేస్తారనేది చక్కగా చూపెట్టారు. అయితే, ఈ దొంగతనంలో వారికి తోడుగా ఉన్న స్టీఫెన్ అనే వ్యక్తి మృతిచెందడంతో, ఆ బంగారం ఎక్కడ ఉందనే సస్పెన్స్ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడింది.

ఇక ఆ తర్వాత ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులు దొంగతానికి సంబంధించిన అసలు విషయాలను ఒక్కక్కటిగా తెలుసుకునే విధానం బాగా చూపెట్టారు. అసలు దొంగలు ఎవరనేది తెలిశాక, వారితో ఓ పోలీస్ ఆఫీసర్ డబుల్ గేమ్ ఆడాలని చూసినా.. వారు ఇచ్చే ట్విస్టును కూడా బాగా రివీల్ చేశారు. మొత్తంగా ఓ హైస్ట్ థ్రిల్లర్ చిత్రంలో ఉండే అంశాలు మనకు ఈ సినిమాలో కూడా కనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :
క్రైమ్, హైస్ట్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రధాన బలం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే కొంతవరకు బాగానే ఉన్నా, సినిమా సాగుతున్న కొద్దీ అది వీక్ అయిపోయింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. మంచి ట్విస్టులు ఇచ్చే స్కోప్ ఉన్నప్పటికీ, ఈ సినిమాను చాలా ఫ్లాట్‌గా ముందుకు తీసుకెళ్లారు.

ఈ సినిమాలోని సెకండాఫ్‌లో కథ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా మైనస్‌గా నిలిచాయి. కథకు మంచి టర్నింగ్ పాయింట్ ఉన్నా, దాన్ని సరిగా వినియోగించుకోలేదని చెప్పాలి. దర్శకుడు థ్రిల్లింగ్ అంశాలపై ఫోకస్ పెట్టడంతో స్క్రీన్ ప్లే టాక్ తప్పినట్లు అనిపిస్తుంది.

ఇక సినిమాలో టైమ్ అండ్ జెర్రీ తరహా మైండ్ గేమ్‌కి కూడా మంచి స్కోప్ ఉన్నా, దానిని పూర్తిగా వాడుకోలేకపోయారు. అటు క్లైమాక్స్ కూడా మరింత పవర్‌ఫుల్ ట్విస్టుతో వచ్చి ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు సూరజ్ వర్మ ఈ చిత్ర కథను హ్యాండిల్ చేసిన తీరు కొంతవరకు ఓకే అనిపిస్తుంది. అయితే, మంచి ట్విస్టులు, బలమైన క్లైమాక్స్ ఉండి ఉంటే సినిమాకు బెటర్ రిజల్ట్ వచ్చేది. స్క్రీన్ ప్లే పై ఆయన మరింత ఫోకస్ పెట్టి ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది.

తీర్పు :
ఓవరాల్‌గా ‘కొల్లా’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలోని సింపుల్ కథ, చక్కటి పర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే, పెద్ద ట్విస్టులు లేకపోవడం, స్క్రీన్ ప్లే ట్రాక్ తప్పడం, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. పెద్ద ట్విస్టులు లేకపోయినా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ‘కొల్లా’ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు