ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 22, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : అర్జున్ కళ్యాణ్, నటాషా తదితరులు.
దర్శకుడు : రాంకీ
నిర్మాణం : కె రాఘవేంద్రరావు బి.ఎ
సంగీత దర్శకుడు : వి కిరణ్ కుమార
సినిమాటోగ్రాఫర్ : గంగనమోని శేఖర్
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారి నుంచి ప్రతీ వారం వస్తున్న వీక్లీ సిరీస్ కొత్త ఎపిసోడ్స్ లో లేటెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నే ‘ఏవి అలనాటి ముద్దులు’. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణంలో వచ్చిన ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
యువ జంట అభి (అర్జున్ కళ్యాణ్), చైత్ర (నటాషా) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే స్వతహాగా రచయిత అయినటువంటి చైత్ర, తన భర్త అభి తమకి పాప పుట్టకముందు ఉన్నంత ప్రేమ, రొమాంటిక్ లైఫ్ ని మిస్ అవుతుంది. అభి కూడా తన కూతురు తోనే ఎక్కువగా కలిసి ఉంటాడు. దీనితో చిన్నబుచ్చుకున్న చైత్ర ఈ ఘటనలపై ఏవి అలనాటి ముద్దులు అనే నవల రాయడం మొదలు పెడుతుంది. అయితే ఈ నవల అయ్యి పబ్లిష్ అయ్యేసరికి ఆమె ఏం తెలుసుకుంది? ఎందుకు ఈ జంట మధ్య దూరం పెరిగింది? అందుకు కారణం ఏంటి, చివరికి వీరు కలిసారా లేదా? తన నవలలో మార్చిన క్లైమాక్స్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఇప్పుడు వరకు ఈటీవీ విన్ కథా సుధలో వచ్చిన అన్ని ఎపిసోడ్స్ లో ఇది ఒకింత డిఫరెంట్ అని చెప్పవచ్చు. కథ పరంగా మాత్రమే కాకుండా కథనం కూడా వాటితో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెయిన్ గా ఇదొక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు.
మొదటి సీన్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక ప్రాపర్ కే రాఘవేంద్రరావు మార్క్ రొమాంటిక్ అంశాలతో ఎంగేజింగ్ గా సాగుతుంది. అలాగే అయన ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ఎంచుకున్న లైన్ కూడా బాగుంది. ముఖ్యంగా యువతకి, పెళ్ళైన జంటలకు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక లీడ్ నటీనటులు మాత్రం అదరగొట్టారు. స్క్రీన్ పై రొమాంటిక్ కపుల్ గానే కాకుండా మంచి నటన కూడా కనబరిచారు. వీటితో పాటుగా ఎమోషనల్ క్లైమాక్స్ కూడా బాగుంది. ఇక అర్జున్ కళ్యాణ్ మంచి స్టైలిష్ లుక్స్ లో కనిపించగా నటాషా తన గ్లామ్ షోతో ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ లో కొన్ని అంశాలు ఎమోషన్ బాగానే ఉన్నప్పటికీ కుటుంబం మొత్తం కలిసి చూసే ఎపిసోడ్ అయితే కాదని చెప్పక తప్పదు. రొమాంటిక్ పాళ్ళు ఒకింత ఎక్కువే కనిపిస్తాయి సో కుటుంబం మొత్తం కలిసి చూద్దాం అంటే కుదరదు. అలాగే హీరోయిన్ పై మరీ ఎక్కువగా గ్లామర్ షో అనిపిస్తుంది.
ఏ సీన్ లో చూసినా ఆమెని కొంచెం హాట్ గానే చూపించే ప్రయత్నం చేశారు. ఇది కొంచెం తగ్గిస్తే బాగుండేది. అలాగే కొన్ని మూమెంట్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. ముఖ్యంగా లీడ్ పాత్రల నడుమ పిల్లలు పుట్టాక తమ రొమాంటిక్ లైఫ్ కి బ్రేక్ పడింది అనే పాయింట్ అంత అర్ధవంతంగా అనిపించదు.
సాంకేతిక వర్గం:
ఈ ఎపిసోడ్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కే రాఘవేంద్ర రావు, నిర్మాణ విలువలు తన కథనంతో మెప్పించారు. అలాగే వి కిరణ్ కుమార సంగీతం బాగుంది. గంగనమోని శేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. రాఘవేంద్ర వర్మ ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది.
ఇక దర్శకుడు రాంకీ విషయానికి వస్తే.. రాఘవేంద్ర రావు గారు ఇచ్చిన కథకి దర్శకునిగా తాను మంచి భాద్యత వహించారు. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లని రాబట్టి, కథలోని ఎలిమెంట్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఏవి అలనాటి ముద్దులు’ ఎపిసోడ్ ఈటీవీ విన్ లో ఇప్పుడు వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కి భిన్నంగా ఒక రొమాంటిక్ షాక్ అని చెప్పవచ్చు. రాఘవేంద్ర రావు గారి మార్క్ రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్, కథనంతో డీసెంట్ గా ఎపిసోడ్ సాగుతుంది. కాకపోతే యూత్ ఇంకా కపుల్స్ వరకు ఈ ఎపిసోడ్ ని ధారాళంగా చూడొచ్చు కానీ కుటుంబసమేతంగా అంటే కొంచెం ఆలోచించుకొని ట్రై చెయ్యండి.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team