
యంగ్ హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’ సినిమా 2012లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో డైలాగ్స్ కి మంచి పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో బాగా ఫేమస్ అవ్వడమే కాకుండా ఓ పెద్ద సినిమాకి రైటర్ గా చాన్స్ కొట్టేసారు. ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? రైటర్ నుంచి డైరెక్టర్ గా మారే అవకాశాలేమన్నా ఉన్నాయా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానమిస్తూ ‘ అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనేది నా ఆశయం. అనుకోకుండా నటున్నయ్యాను. ఆ తర్వాత ‘శాంతి నివాసం’, అమృతం’ లాంటి సీరియల్స్ కి దర్శకత్వం వహించాను. నాకు మొదటి నుంచి రైటింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. గతంలో ‘త్రీ’, ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ సినిమాలకు రైటర్ గా పనిచేసాను. అవినాకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఇష్క్ తో మంచి పేరు వచ్చింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ గుర్తింపు వచ్చింది. దాంతో నాగార్జున గారు నన్ను నమ్మి ‘మనం’ సినిమాకి చాన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను. అందుకే ప్రస్తుతం నా దృష్టంతా ఆ సినిమా పైనే ఉంది. అది పూర్తయిన తర్వాత వచ్చే అవకాశాల్ని బట్టి డైరెక్షన్ గురించి ఆలోచిస్తానని’ హర్షవర్ధన్ అన్నాడు.