గద్దె రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరులో జన్మించి తెలుగు చలన చిత్ర రంగంలో ‘నటకిరీటి’గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. 1959 జూలై 19న జన్మించిన ఈ విలక్షణ నటుడు 1977లో ‘స్నేహం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ ప్రధానమున్న పాత్రలు చేస్తూ కామెడీ హీరోగా ఎదిగారు మరియు ఎప్పటికప్పుడు నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేస్తూ, ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రకాల విభిన్న పాత్రలు చేసిన అతి తక్కువ మందిలో ఈయన కూడా ఒకరయ్యారు.
ఇప్పటి వరకూ 200 పైగా చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ గారికి 1985లో వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘లేడీస్ టైలర్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి మొదలైన రాజేంద్ర ప్రసాద్ ప్రస్థానం 1995 వరకు ఆగకుండా సాగింది. ఈ సమయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటు కుంటూ మరియు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అందులో ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘ఆహ నా పెళ్ళంట’, ‘అప్పుల అప్పారావు’, ‘ మిష్టర్ పెళ్ళాం’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ మరియు ‘ఎర్ర మందారం’ లాంటి మరెన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ మధ్య కాలం నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద ప్రొడక్షన్ సంస్థల్లో మరియు యంగ్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించారు మరియు ‘ఓనమాలు’ సినిమాలో స్కూల్ హెడ్ మాస్టర్ పాత్రని పోషించారు. ఈ రెండు చిత్రాలు ఆగస్టులో విడుదల కానున్నాయి.
ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.