రెబల్ స్టార్ కృష్ణంరాజుకి నట వారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆరడుగుల అజానుబాహుడిలా భారీ ఫిజిక్ కలిగి ఉండే ప్రభాస్ ఈ రోజు తన 34వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. 1979 అక్టోబర్ 23న సూర్య నారాయణ రాజు – శివ కుమారి దంపతులకు ప్రభాస్ జన్మించాడు. హీరోగా తను ఇండస్ట్రీ కి పరిచయమైన తర్వాత టాలెంట్ ఉన్న హీరోగా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.
ప్రభాస్ 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తను చేసిన ‘వర్షం’ సినిమా ప్రభాస్ కి బ్రేక్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అక్కడి నుంచి మాస్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వచ్చిన ప్రభాస్, ‘డార్లింగ్’, ‘Mr పర్ఫెక్ట్’ లాంటి సినిమాలు చేసి లేడీ ఫాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం తను చేసిన ‘మిర్చి’ మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా అందరి నోటా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రభార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం దృష్టంతా ఈ సినిమాపైనే పెట్టిన ప్రభాస్ ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చేయడానికి సముఖత చూపడం లేదు. ‘ఛత్రపతి’ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘బాహుబలి’ కూడా అంతకు మించి ఘన విజయాన్ని సాధించాలని కోరుకుందాం.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.