స్వర బ్రహ్మ మణిశర్మకి జన్మదిన శుభాకాంక్షలు

స్వర బ్రహ్మ మణిశర్మకి జన్మదిన శుభాకాంక్షలు

Published on Jul 11, 2012 5:00 PM IST


ఈ రోజు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన సంగీతంతో అలరిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సంగీత దర్శకుడు స్వర బ్రహ్మ మణిశర్మ పుట్టిన రోజు. ఈయన 1964 జూలై 11న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. సినీ ప్రస్థానం మొదలు పెట్టిన మొదట్లో రాజ్-కోటి, ఎం.ఎం కీరవాణి మరియు ‘మాస్ట్రో’ ఇళయరాజాల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేశారు. ఆ తర్వాత 1998లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రాత్రి’ మరియు ‘అంతం’ సినిమాతో నేపధ్య సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏ.వి.ఎస్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్ హీరోస్’ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రంతో మణిశర్మకి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలకు ఎన్నో హిట్ సినిమాల సంగీతాన్ని అందించారు. అందులో ముఖ్యంగా ‘చూడాలని ఉంది’, ‘ప్రేమించుకుందాం రా’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’,’ఇంద్ర’, ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘ఖుషి’, ‘ చిరుత’, ‘పరుగు’, ‘తీన్ మార్’ మరియు ‘రచ్చ’ లాంటి ఎన్నో చిత్రాలకు చక్కటి సంగీతాన్ని అందించారు.

ఇప్పటి వరకు మణిశర్మ 140 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించారు. మణిశర్మ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం మరియు హిందీ భాషల్లో కూడా సంగీతం అందిచారు. ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలాగే మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించి తెలుగు ప్రేక్షకుల అభినందనలు అందుకోవాలని ఆశిద్దాం.

ఈ రోజు మణిశర్మ గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున స్వర బ్రహ్మకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.

తాజా వార్తలు