ప్రభాస్, పవన్ ముందడుగు మంచిదే

ప్రభాస్, పవన్ ముందడుగు మంచిదే

Published on Nov 6, 2020 2:19 AM IST

అన్ లాక్ ప్రక్రియ మొదలై చాలా రోజులే అయింది. ఇప్పుడిప్పిడే పరిశ్రమలో సినిమా షూటింగ్స్ వేగం పుంజుకుంటున్నాయి. మొదట్లో చిన్న, మధ్యతరహా సినిమాలు మొదలైనప్పటికీ స్టార్ హీరోలెవరూ బయటికి రాకపోవడంతో ఒకరకమైన సందిగ్ధత నెలకొంది. పెద్ద సినిమాలు మొదలుకాకపోవడంతో థియేటర్ల యాజమాన్యం సైతం ధైర్యం చేసి పూర్తిస్థాయిలో హాళ్లను తెరవలేకపోయాయి. ప్రేక్షకులు నెలకొన్న కోవిడ్ భయాందోళనలను అధిగమించాలంటే పెద్ద సినిమాలు విడుదలైతేనే సాధ్యమవుతుందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భావించారు.

కానీ సగం పూర్తైన, ఆరంభం కావాల్సిన పెద్ద చిత్రాలు మొదలుకాలేదు. పెద్ద హీరోలు ఎవరూ బయటికి రావడానికి సాహసించలేదు. అలాంటి సమయంలోనే ప్రభాస్ బయటికొచ్చి ‘రాధేశ్యామ్’ రీస్టార్ట్ చేశారు. అది కూడ విదేశాల్లో కావడం విశేషం. ఆ తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ తన ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కూడ స్టార్ట్ చేశారు. దీంతో పెద్ద బృందాలతో పనిచేయాల్సిన సినిమాలకు ఒక ధైర్యం వచ్చినట్టైంది. పవన్ కంటే ముందు నాగర్జున ‘వైల్డ్ డాగ్’ షూట్ హిమాలయాల్లో మొదలైంది. అలాగే వెంకటేష్ ‘నారప్ప’ కూడ తాజాగా స్టార్టయింది. ఇలా పెద్ద హీరోలు ఒక్కొకరే బయటికి రావడం సినిమా ఇండస్ట్రీ పాత పరిస్థితికి వస్తోందనే సంకేతాలిస్తోంది. ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరోల సినిమాలు రీస్టార్ట్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు