ఎన్టీఆర్ హీరోగా కెరీర్ ప్రారంభించి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది. ఏడాదికి రెండు లేదా కనీసం ఒక సినిమా విడుదల చేయడం ఆయనకు అలవాటు. మొదట్లో ఏడాదికి మూడు సినిమాలు కూడా చేశారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఆయన రెండేళ్లు వెండి తెరకు దూరం అవుతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ మూవీ 2021 జనవరి 8కి వాయిదా పడింది. ఈ చిత్రం కారణంగా 2019లో ఒక్క సినిమా కూడా చేయని ఎన్టీఆర్, 2020 సంవత్సరాన్ని కూడా అలాగే ముగించనున్నాడు.
దీనితో రెండేళ్లు ఎన్టీఆర్ వెండితెరకు దూరం కానున్నారు. గతంలో 2009లో మాత్రమే ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్ళీ 2019, 2020 సంవత్సరాలను ఆయన అలాగే ముగించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొంచెం నిరాశపరిచే విషయమే. కాకపోతే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్రం కోసం ఇలాంటి త్యాగాలు తప్పవు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.