శేఖర్ కమ్ముల దర్శకత్వం వహినచిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం మరో సారి వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు, ఆ తర్వాత ఆగష్టు 31న విడుదల చేయాలనుకున్నారు. చివరికి సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా చాలా మంది పెద్ద హీరోల సినిమాలు రానున్న సెప్టెంబర్లో విడుదల కానుడడం విశేషం. శేఖర్ కమ్ములకి యు.ఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ సిటీల్లో మంచి క్రేజ్ ఉన్నా పెద్ద హీరోల సినిమాల వల్ల ఈ చిత్రం మొదటి వారం ఓపెనింగ్ కలెక్షన్స్ అయినా రాబట్టుకుంటుందా లేదా అనేది సందేహంగా మిగిలింది. శేఖర్ కమ్ముల ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులైన అబిజీత్, సుధాకర్, కౌశిక్, శగున్, జర, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్ మరియు శ్రీరామ్ లను తెరకు పరిచయం చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే సుమారు 20 సంవత్సరాల తర్వాత అక్కినేని అమల ఈ చిత్రంలో నటించారు. అలాగే అందాల భామలు శ్రియ మరియు అంజలా జావేరి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సుమారు కోటి రూపాయల ఖర్చుతో తోట తరణి ఒక అద్భుతమైన కాలనీ సెట్ ని వేశారు.విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం గురించి ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆరుగురు యువకుల అందమైన కలల ప్రపంచమే ఈ చిత్ర కథ. ఈ చిత్రం కొంచెం ‘హ్యాపీడేస్’ సినిమాని పోలి ఉంటుంది కానీ ఈ సినిమా అంతా ఒక కాలనీలో జరుగుతుందని’ ఆయన అన్నారు.