ఆర్ ఆర్ ఆర్ లో అసలు వాళ్ళిద్దరికీ ప్రాధాన్యం ఉందా..?

దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ చూడని ఇబ్బందులు, అవాంతరాలు రౌద్రం రణం రుధిరం సినిమా విషయంలో ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుండి అనేక కారణాలతో పలు మార్లు వాయిదాపడుతూ వచ్చింది. దీనితో 2020 జులై కి రావలసిన ఈ చిత్రం 2021 జనవరికి వాయిదాపడింది. ఇకనైనా షూటింగ్ సజావుగా జరుపుదాం అంటే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా ప్రభుత్వాలు టోటల్ లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడింది. ఆ విషయం అటుంచితే అసలు ఈ సినిమాలో హీరోయిన్స్ కి ఏమైనా ప్రాధాన్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ కి జంటగా అలియా భట్ ని తీసుకోగా, ఎన్టీఆర్ కి హీరోయిన్ గా బ్రిటిష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని తీసుకున్నారు. 70శాతానికి పైగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయ్యిందని స్వయంగా చిత్ర యూనిట్ చెవుతుండగా, ఇప్పటి కూడా హీరోయిన్స్ ఇద్దరు షూటింగ్ లో పాల్గొనలేదు. అలియాభట్ పూణేలో మొదలుకానున్న నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తుండగా, ఇక ఒలీవియా మోరిస్ ఎప్పుడు షూటింగ్ కి వస్తారో, అసలు ఆమె పాత్ర పరిధి ఎంతో తెలియని పరిస్థితి. ఈ పరిణామాలు చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్స్ పాత్రలు నామ మాత్రమేనా అనే అనుమానం కలుగుతుంది. గతంలో అలియాభట్ తన పాత్రకు సరైన ప్రాధాన్యం లేదని తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితి చూస్తుంటే.. హీరోయిన్స్ పాత్రల పరిధి, ప్రాధాన్యం తక్కువే అనిపిస్తుంది.

Exit mobile version