సినీ నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నిర్మాత ‘దిల్’ రాజు. ‘దిల్’ రాజు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఏ మాత్రం ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నిర్మాత మరియు ఈ మధ్యకాలంలో ఒకే సారి రెండు మూడు చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాత. ‘దిల్’ రాజు తన నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది కొత్తవారిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రస్తుతం వెంకటేష్ , మహేష్ బాబు మరియు రామ్ చరణ్ లతో చిత్రాలను నిర్మిస్తున్నారు.
తెలుగు చలన చిత్ర రంగంలో మల్టీ స్టారర్ చిత్రాలు కనుమరుగై పోతున్న సమయంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలతో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ” ఎవడు” అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలను ఒకే సమయంలో తెరకెక్కిస్తూ అటు ఆ చిత్రానికి మరియు ఇటు ఈ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని మరియు హీరోలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఆలోచనలతో దిల్ రాజు నలిగిపోతున్నారు. ఈ చిత్రాలు పూర్తయిన వెంటనే మరి కొన్ని కొత్త సినిమాలను ప్రారంభించనున్నారు. ‘దిల్’ రాజు ఇప్పటి వరకూ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ చిత్రాలు చేసి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.