త్వరలో విడుదలవుతున్న కింగ్ అక్కినేని నాగార్జున ‘డమరుకం’ సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదల కాబోతుంది. మొదటగా ఈ సినిమాని అక్టోబర్ 11న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. కాని ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్ 12న విడుదల కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదటగా అనుకున్న తేదీకి కాకుండా ఒక రోజు ఎందుకు ఆలస్యంగా విడుదలవుతుంది అన్న విషయాల్లోకి వెళితే, డమరుకం సినిమాని మొదటగా అనుకున్న అక్టోబర్ 11న అయితే గురువారం విడుదల చేసి వారాంతపు వసూళ్లు సొమ్ము చేసుకోవాలని సన్నాహాలు చేసారు. అయితే సాధారణంగా దాదాపు ప్రతి సినిమా శుక్రవారం విడుదల చేసే సంప్రదాయం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. డమరుకంతో పాటుగా సూర్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో డబ్బింగ్ సినిమా బ్రదర్స్ కూడా అదే రోజు విడుదలవుతుంది. పేరుకే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో సూర్యకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా డమరుకంకి పోటీగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.