‘కలర్స్’ అనే టీవీ ప్రోగ్రాం ద్వారా బుల్లి తెరపై మెరిసిన అచ్చ తెలుగమ్మాయి స్వాతి. ‘డేంజర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రం ద్వారా అమాయకత్వమైన పాత్రతో అందరినీ ఆకట్టుకున్న కలర్స్ స్వాతి ఆ తర్వాత తెలుగు మరియు తమిళంలో కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఒకేసారి తెలుగు మరియు తమిళంలో క్రేజ్ తెచ్చుకోవాలని ఉద్దేశంతో రెండు పడవల మీద అటో కాలు ఇటో కాలు వేసి ప్రయాణం చేసిన స్వాతి చివరికి ఎటూ కాకుండా పోయి సరైన అవకాశాలు దక్కించుకోవడంలో వెనకపడిపోయింది. తెలుగులో అడపాదడపా ఆఫర్లు వస్తున్నా తమిళంలో ఆఫర్లు లేకపోవడంతో ఈ భామ ఇటీవలే తమిళ మీడియాకి ఇచ్చిన స్టేట్ మెంట్ తో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ ఆ స్టేట్ మెంట్ ఏమిటంటే ‘ఫ్యామిలీ తరహా పాత్రలే కాదు, ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా నేను సిద్దమే అని’ ఆమె అన్నారు. ఇది విన్న తెలుగు వాళ్ళు అవాక్కైనా ఈ బంపర్ ఆఫర్ ని ఎంత మంది తమిళ నిర్మాతలు వాడుకుంటారో అనే దాని కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కలర్స్ స్వాతి తెలుగులో ‘స్వామి రా రా’ మరియు ‘ బంగారు కోడిపెట్ట’ చిత్రాల్లో నటిస్తోంది, అలాగే త్వరలోనే ఒక మలయాళీ సినిమాలో నటించనుంది.