హైదరాబాద్‌లో ‘సినిమాటికా ఎక్స్‌పో 2025’ వైభవంగా ప్రారంభం

హైదరాబాద్‌లో ‘సినిమాటికా ఎక్స్‌పో 2025’ వైభవంగా ప్రారంభం

Published on Nov 1, 2025 10:00 AM IST

హాలీవుడ్ స్థాయి సాంకేతికతను టాలీవుడ్‌కు పరిచయం చేసే లక్ష్యంతో, ‘సినిమాటికా ఎక్స్‌పో 2025’ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నొవోటెల్ HICCలో ఘనంగా మొదలైంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా “హాలీవుడ్ టు టాలీవుడ్” అనే కాన్సెప్ట్‌తో సినీ రంగంలో సాంకేతికత, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఎక్స్‌పో థీమ్‌ “From Hollywood to Hyderabad: Building the Global Gateway of Cinema”గా ఉంది.

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. హీరో తేజ సజ్జ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత దిల్ రాజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఇండియాజాయ్ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, దేశంలో ఉత్పత్తి అయ్యే వీఎఫ్‌ఎక్స్‌లో 25 శాతం ఇక్కడే రూపొందుతోందని తెలిపారు. నగరంలో 400 వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు, 200లకు పైగా ఏవీజీసీ స్టూడియోలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఈ వేదిక సినీ పరిశ్రమకు వచ్చే కొత్త టెక్నీషియన్లు, క్రియేటర్స్‌కు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సాంకేతిక నిపుణులు, క్రియేటర్లు ఈ ఎక్స్‌పో ద్వారా పరిశ్రమకు వస్తారని హీరో తేజ సజ్జ అన్నారు. హైదరాబాద్ త్వరలో హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం చూసేలా సినిమా రంగంలో అభివృద్ధి చెందాలని కోరారు. ‘సినిక క్రియేటర్స్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో ఈ ఎక్స్‌పో జరుగుతోంది. పి.జి. విందా మాట్లాడుతూ, భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

తాజా వార్తలు