రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వేగంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో శాండల్‌వుడ్ బ్యూటీ చైత్ర జె ఆచార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ మొదటి నుండి చాలా ఆసక్తికరంగా సాగుతోందని చైత్ర చెప్పుకొచ్చింది. ఫౌజీ వంటి భారీ సినిమాలో భాగమవడం తనకు చాలా పెద్ద విషయమని ఆమె చెప్పింది. “ప్రభాస్‌తో పని చేయడం గొప్ప లెర్నింగ్. ఇంత పెద్ద ప్రొడక్షన్ ఎలా పనిచేస్తుంది, సెట్ రిథమ్, క్రాఫ్ట్, డిటైల్స్.. ఇలా అన్నింటినీ నేర్చుకునే అవకాశం దక్కింది. నా పాత్ర కథలో కీలకమైనది. రోల్ చిన్నదా పెద్దదా అనే విషయం ముఖ్యం కాదు, సినిమా ప్రొడక్షన్ ముఖ్యం. ఆ విషయంలో ఫౌజీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది” అని చైత్ర చెప్పుకొచ్చింది.
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. “నా పాత్రకు సంబంధించిన కొన్ని షాట్స్ ఆయన ముందే చూశారట. నేను ఆయనను పరిచయం చేసుకునే సరికి, నా వర్క్ చూశానని చెప్పారు. నేను ఆయన నటించిన ‘మిర్చి’కి పెద్ద ఫ్యాన్‌ని.. కనీసం 25 సార్లు చూశానని చెప్పాను” అంటూ ప్రభాస్ పేరుకే ఉప్పొంగిపోతుంది ఈ బ్యూటీ. ఇక ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
