నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్లో రెండో ర్యాంక్ హీరోలలో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. థియేట్రికల్ కాకుండా నాని సినిమాల నాన్-థియేట్రికల్ మార్కెట్ కూడా బలంగానే ఉండటంతో, ఆయనతో పనిచేయడానికి అనేక ప్రతిభావంతులైన దర్శకులు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో నాని బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 మొదటి అర్ధభాగంలో విడుదల కానుంది. తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఒక యాక్షన్ డ్రామాకు నాని సిద్ధమవుతున్నారు.
అంతేకాక, తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్‌తో కూడా నాని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ఇద్దరూ కలుసుకొని ఒక కొత్త కాన్సెప్ట్‌పై మాట్లాడుకున్నారు. ఆ ఐడియా నానికి నచ్చడంతో ఆయన ఫార్మల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘96’, ‘మెయ్యళగన్’ వంటి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన ప్రేమ్ కుమార్‌పై నానికి చాలా కాలంగా అభిమానముంది. ఇంటర్వ్యూలో కూడా నాని దీనిని ఎన్నిసార్లో వెల్లడించారు.
అయితే నాని-ప్రేమ్ కుమార్ సినిమా త్వరగా మొదలయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇద్దరికీ ముందుగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. నాని వరుసగా రెండు చిత్రాలకు కమిట్ అవ్వగా, ప్రేమ్ కుమార్‌కు విక్రమ్‌తో పాటు మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. అన్నీ సెట్ అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
