ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో వణికిపోతున్న వేళ భారతీయులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుండి ఇండియాకు వచ్చేవారు ఎవరైనా సరే వైద్య పరీక్షలకు హాజరవడం, కొన్ని రోజులపాటు స్వీయ గృహ నిర్భందంలో ఉండటం తప్పనిసరి అయింది. సినీ సెలబ్రిటీలు సైతం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ జాగ్రత్తల్ని పాటిస్తున్నారు. కానీ బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ మాత్రం ఈ జాగ్రత్తల్ని పెడ చెవిన పెటి కరోనా వైరస్ బారిన పడ్డారు.
ఆదివారం యూకే నుండి లక్నో తిరిగి వచ్చిన ఆమె ఆ విషయాన్ని బయటకు తెలియకుండా దాచారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసి ఒక పెద్ద పార్టీకి కూడా హాజరయ్యారు. ఈ లావిష్ పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నట్టు సమాచారం. పార్టీ అనంతరం వైరస్ లక్షణాలు కనబడటంతో ఆమె వైద్య పరీక్షలకు హాజరవగా కొవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అనేక మంది ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రజలు ఆమెపై మండిపడుతున్నారు.