కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ సుడిగాడు విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్ర విషయాలను తెలియజేయడానికి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ “మా సుడిగాడు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ నెల 24న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సుడిగాడు సినిమాని సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరినీ టార్గెట్ చేసి తీయలేదు. కేవలం సినిమాలను టార్గెట్ చేసి తీసింది మాత్రమే కానీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించలేదు.
2000 సంవత్సరం నుండి ఇప్పటివరకు వచ్చిన లేటెస్ట్ అన్ని సినిమాలని ఈ సినిమాలో స్పూఫ్ చేసాం. ఈ సినిమా కోసం దాదాపు 18 నెలల కష్టపడ్డాను. ఆ కష్టాలన్నీ ట్రైలర్ కి వస్తున్న భారీ స్పందన చూస్తుంటే మర్చిపోతున్నాను. ట్రైలర్ చూసాక రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రెండు సార్లు ట్విట్టర్ ద్వారా మాకు అభినందనలు తెలిపారు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ సినిమా సుడిగాడు అవుతుంది.