కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో ‘బలుపు’ ఆడియో విడుదలయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి హీరోయిన్స్. పోట్లురి వి ప్రసాద్ ఈ సినిమాను పి.వి.పి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆయనకు తెలుగు సినీ రంగంలో నిర్మాతగా ఇదే మొదటి చిత్రం. ఈ వేడుకకు దాసరి నారాయణరావు, కె.ఎల్ నారాయణ రావు, బండ్ల గణేష్, నందిని రెడ్డి, అజయ్, భీమినేని శ్రీనివాసరావు, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, స్రవంతి రవి కిషోర్, దామోదర్ ప్రసాద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఆడియో లాంచ్ లో రవితేజ, శృతి మరియు అంజలి చేసిన డాన్స్ ఈ వేడుకకే హై లైట్ గా నిలిచింది. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ “నా స్నేహితుడు పి.వి.పి నాకు మొదట్నుంచి అందించిన సహకారానికి నేను కృతజ్ఞుడిని. ఆయన మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని ఆశిస్తున్నాను. గోపీచంద్ చాలా కష్టజీవి. అతనితో నాకు ఇది రెండవ సినిమా. థమన్ అద్బుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. అతను నాచేత ఈరోజు డాన్స్ చేయించగలిగాడు అన్న సంఘటనను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని” తెలిపాడు. ఈ సినిమా జూన్ 21న విడుదలకానుంది.