తమిళ స్టార్ హీరో అజిత్ చేస్తున్న నూతన చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో మొదలైంది. ఇక్కడే ఛేజింగ్ సన్నివేశాలతో పాటు ఇంకొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బైక్ ఛేజింగ్ సన్నివేశాలను అజిత్ ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నారు. ఇందుకోసం అజిత్ తన సొంత బైక్‌లు వాడుతున్నారట. స్వతహాగా అజిత్ ప్రొఫెషనల్ బైక్ రేసర్. కార్ల కంటే ఖరీదైన బైక్‌లే ఆయన వద్ద ఎక్కువగా ఉంటాయి.
చెన్నైలోని తన ఇంటి గ్యారేజిలో ఉన్న సూపర్ బైక్‌లను హైదరాబాద్ కు తెప్పించుకుని మరీ షూటింగ్లో వాడుతున్నారట. అంతేకాదు స్టే చేస్తున్న ప్రదేశం నుండి షూటింగ్ లొకేషన్ వరకు రావడానికి కూడ అజిత్ కార్లను వాడకుండా ఆ బైక్‌లనే వినియోగిస్తుండటం విశేషం. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు.