సమీక్ష : సితారే జమీన్ పర్ – ‘ప్రత్యేకం’గా వారిని మాత్రమే ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!

విడుదల తేదీ : జూన్ 20, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : అమీర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్, అరౌష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భాన్సాలి, ఆశిష్ పెండ్సే తదితరులు..
దర్శకుడు : ఆర్.ఎస్.ప్రసన్న
నిర్మాతలు : అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్, రవి భగ్చంద్క, శ్రీనివాస్ రావు
సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్
సినిమాటోగ్రఫీ : జి.శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్ : చారుశ్రీ రెడ్డి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ‘తారే జమీన్ పర్’ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ అంటూ మరో ఎమోషనల్ రైడ్ చిత్రాన్ని మనముందుకు తీసుకొచ్చాడు అమీర్ ఖాన్. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

గుల్షన్ అరోరా(అమీర్ ఖాన్) ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్. అయితే, అతడి షార్ట్ టెంపర్ తదితర అలవాట్లు అతడిని పలు ఇబ్బందుల్లో పడేస్తాయి. దీంతో ఓరోజు మద్యం సేవించి వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయిన గుల్షన్ అరోరాకు కోర్టు జడ్జి మానసిక దివ్యాంగుల జట్టుకు బాస్కెట్ బాల్ కోచ్‌గా పనిచేయాలని శిక్షిస్తుంది. దీంతో మానసిక దివ్యాంగుల జట్టుకు అమీర్ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు..? అతడికి తన భార్య జెనీలియాతో ఎలాంటి సమస్య ఉంటుంది..? ఈ క్రమంలో అతడికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి..? చివరికి ఈ జట్టుతో అతను ఏం సాధిస్తాడు..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

‘తారే జమీన్ పర్’ సినిమా చూసిన వారికి ‘సితారే జమీన్ పర్’ కథ పెద్దగా తేడా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ, అందులోని ఎమోషన్స్, ఇందులోని ఎమోషన్స్‌లో చాలా తేడా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్, మానసిక పరిపక్వత లేకపోవడం వంటి వారు తామ అనుకుంటే ఎలాంటి విజయాలను అయినా అందుకుంటారు అనే అంశాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.

ఫస్టాఫ్‌లో కథను చాలా ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఆ తర్వాత దర్శకుడు కొంతమేర ట్రాక్ తప్పినట్లుగా అనిపిస్తుంది. ఓ శిక్ష కారణంగా బాస్కెట్ బాల్ కోచ్‌గా వచ్చిన హీరో, మానసిక దివ్యాంగులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది చక్కగా చూపెట్టారు.

ఇక తన జట్టును ఎలాగైనా గెలిపించాలనే కోచ్ పాత్రలో అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతని భార్య సునీత(జెనీలియా)తో అతనికి ఉండే మనస్పర్థలు ఏ విధంగా తొలిగిపోతాయనేది కూడా చక్క.గా చూపించారు. ఇక ఈ క్రమంలో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

‘తారే జమీన్ పర్’ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు, ఈ ‘సితారే జమీన్ పర్’ కథ చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. కథలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను పూర్తిగా ప్రభావితం చేసేలా వినియోగించుకోలేకపోయారు.

ఇలాంటి సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌కు పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. కానీ, ఎమోషన్స్‌ను ఏ కోసాన కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. అయితే, కథలోని పాత్రలకు సంబంధించిన గతాన్ని చాలా తేలికగా తీసుకున్నట్లు మనకు చూపెడతారు.

అటు హీరో వారితో ప్రవర్తించే తీరు కూడా మనకు ఏమాత్రం కనెక్ట్ కాదు. కేవలం క్లైమాక్స్‌లోనే హీరోకు వారితో బంధం ఏర్పడుతుందనే పాయింట్ ప్రేక్షకులను మెప్పించదు. మధ్యలో వచ్చే హీరో అతడి భార్య.. అతడి తల్లి ఎపిసోడ్స్ సినిమాను ల్యాగ్ చేసినట్లు అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఆర్.ఎస్.ప్రసన్న ఇలాంటి ఎమోషనల్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. అయితే, ఆయన ఈ చిత్ర స్క్రీన్‌ప్లే, కొన్ని ల్యాగ్ సీన్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీతం పరంగా వచ్చే పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘సితారే జమీన్ పర్’ చిత్రం ఓ చక్కటి ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. బలమైన ఎమోషన్స్, చక్కటి పర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే, ‘తారే జమీన్ పర్’ సినిమాను చూసి అదే తరహా అంచనాలతో ఈ సినిమాకు వెళ్తే, వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎమోషనల్ కంటెంట్ చిత్రాలు ఇష్టపడే వారిని ‘సితారే జమీన్ పర్’ ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version