నిండు సరస్సు లాంటి చిత్రసీమలో వికసించిన నటపుష్పం ‘శ్రీ’. శ్రీగా చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన హీరో పేరు శ్రీనివాస్. విజయవాడ జన్మస్థలం. క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సంచలన విజయం సాధించిన ‘ఈ రోజుల్లో’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన శ్రీ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. తనకు ఇచ్చిన పాత్రను అర్థం చేసుకొని దర్శకుడి సూచనల మేరకు నటిస్తూ పాత్ర ఔచిత్యాన్ని కాపాడుతూ అందరి మన్ననలు ప్రశంసలు పొందుతున్న వర్థమాన హీరో శ్రీ. చిరుజల్లు కురిసే ఆషాడ మేఘాల్లా తిరుమలగిరుల అంతరాల్లో ప్రవహించే పవిత్రతలా నట ప్రస్థానం సాగిపోతుందంటున్నారు ‘శ్రీ’. చిత్రసీమలో ఎదురవుతున్న అనుభవాలను ఆయన ముచ్చటించారు.
ఇటీవల విడుదలైన ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ చిత్రం ఇచ్చిన సక్సెస్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నారా?
అవును.. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్ నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నా క్యారెక్టర్‌ని అందరూ మెచ్చుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఇప్పటికీ కొంతమంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు.
శ్రీనివాస్‌గా ఇండస్ట్రీకొచ్చి తొలిచిత్రంతో ‘శ్రీ’గా పేరు మార్చుకున్నావు. అయితే ఇక ‘శ్రీ’గానే వుండాలనుకొంటున్నారా?
తొలి చిత్రం ‘ఈ రోజుల్లో’ ‘శ్రీ’గానే పరిచయం అయ్యాను. ఆ తర్వాత చేస్తున్న చిత్రాల్లో కూడా ‘శ్రీ’గా పిలవబడుతున్నా. అయితే టైటిల్స్ కార్డ్స్‌లో మాత్రం ‘శ్రీని’గా రాస్తున్నారు. రాయడం ఎలా వున్నా పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ‘శ్రీ’గానే తెలుసు.
సినీరంగ ప్రవేశానికి రావడానికి ప్రేరణ ఏమిటి?
సినీరంగంలో ప్రవేశించాలనే కోరిక ఉన్నా చిత్రంలో నటించే అవకాశం రావడం యాదృచ్చికంగానే జరిగింది. మా స్నేహితుడు సినిమా తీస్తుంటే కలవటానికి వెళ్లాను. అక్కడే దర్శకుడు మారుతి గారితో పరిచయం కలిగింది. కథా చర్చల్లో నేనూ పాల్గొన్నాను. సడన్‌గా మారుతి గారు ‘వేషం వుంది నువ్వు చేస్తావా’ అన్నారు. సరే అన్నాను. ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటూ డెమో సీడిగా తయారైన చిత్రం ‘ఈ రోజుల్లో’గా విడుదలై విజయవంతమైంది.
‘ఈ రోజుల్లో’ చిత్రానికొచ్చిన రెస్పాన్స్ ఎలా ఎంజాయ్ చేసారు?
నిజంగా ఎంజాయ్ చేయలేకపోయాను. అప్పుడూ చేయలేకపోయాను. ఆ తర్వాతా ఎంజాయ్ చేయలేకపోయాను. ఈ చిత్రం రిలీజ్ రోజునే నాకొచ్చిన మరో అవకాశం ‘అరవింద్ 2’ చిత్రంలో నటించడం. ఆ షూటింగ్‌లో బిజీ అయిపోవడంతో ఆ అవకాశం మిస్సయ్యాను.
ఇంట్లో కుటుంబ సభ్యుల రెస్పాన్స్ ఎలా వుంది?
నిజం చెప్పాలంటే ఈ రెండు చిత్రాల్లో యాక్ట్ చేస్తున్న విషయం మా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. తర్వాత తెలిసి అభినందించారు. అయితే తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం పెద్దగా లేకపోయినా నిరుత్సాహపర్చలేదు. ఒకరోజు మా నాన్నగారు పిలిచి సీరియస్‌గా ఓ విషయం చెప్పారు. సినీఫీల్డ్ గురించి రకరకాలుగా వింటుంటాం, జాగ్రత్తగా వుండు. రూపాయి నువ్వు నష్టపోయినా పర్వాలేదు. కానీ, నీ వల్ల మేము నష్టపోయాము, మోసపోయాము అనే మాట నా చెవిన పడకూడదని హెచ్చరించారు. ఆ విషయం శిరోధార్యంగా భావిస్తూ నా ప్రయాణం సాగిస్తున్నాను. ‘శ్రీ’ నటించిన చిత్రం విడుదలకు ఇబ్బంది లేదు. అమ్మడుపోకపోయినా శ్రీ బయట పడేస్తాడనే ముద్ర ఉంది.
‘అరవింద్ 2’ సినిమా ఆఫర్ తర్వాత ఏం చేసారు?
‘ఈ రోజుల్లో’ చేస్తున్న సమయంలోనే దర్శకుడు శేఖర్ సూరి గారిని మీ దర్శకత్వంలో చేస్తానని అడిగాను. పెద్ద దర్శకులు కదా, అలాంటి వారివద్ద చేస్తే అనుభవం, అవగహన వస్తుందని ఆశించాను. ఆయన అవకాశమిచ్చి ప్రోత్సహించారు. తర్వాత చేసిన ‘రయ్ రయ్’ మాస్ ఎంటర్‌టైనర్. బి, సి సెంటర్స్‌లో మంచి పేరొచ్చింది. ‘ఈ రోజుల్లో’ చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించాను. అందులో క్యారెక్టర్ పేరు ‘శ్రీ’. అదే నాకు స్థిరపడిరది. ‘అరవింద్ 2’లో టాటూయిస్ట్ పాత్ర. ‘రయ్ రయ్’లో పల్లెటూరి కుర్రాడి క్యారెక్టర్. తర్వాత చేసిన ‘లవ్ సైకిల్’ చిత్రంలో యాడ్ మేకర్ పాత్ర. ఇటీవల విడుదలైన చిత్రం ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’లో మెమరీలాస్ పేషెంట్‌గా చేసాను. అదీ మంచి పేరు గుర్తింపూ తెచ్చింది.
మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏమిటి?
చేసిన చిత్రాల్లోని విభిన్నమైన క్యారెక్టర్స్ ఒకదానికొకటి పోలిక లేదు. ‘రయ్ రయ్’ చిత్రంలోని క్యారెక్టర్‌కు, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ చిత్రంలోని క్యారెక్టర్ పూర్తి భిన్నం. పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, భిన్నమైన నటన కనపర్చడానికి చేసిన చిత్రాలు ఉపయోగపడ్డాయి. ‘శ్రీ’కి ఎలాంటి పాత్ర ఇచ్చినా పండిస్తాడని, పాత్రకు తగిన న్యాయం చేస్తాడని అనిపించుకున్నాను. నాక్కూడా డిఫరెంట్ పాత్రలు చేస్తూ హీరోయిజంతో పాటు నటన కనబర్చాలనేది కోరిక.
మీరు చేసిన ఐదు చిత్రాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్యారెక్టర్ వుందా?
ఐదు చిత్రాల అనుభవంతోనే గొప్ప వ్యక్తిత్వం అలవడిరది. సినిమాల పట్ల నిర్మాణం పట్ల అవగహన కలిగింది. వచ్చిన ప్రతి అవకాశం ఇష్టపడి కష్టపడి చేసాను. లొకేషన్స్‌లోనే నేర్చుకొన్నాను. చేస్తున్న పాత్ర పట్ల అవగాహన కలిగించుకుని దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేస్తాడు అనిపించుకొన్నాను. శ్రీ ఒక తెల్ల కాగితం లాంటివాడని సర్టిఫికెట్ పొందాను. ఫలానా పాత్ర అనే నియమం లేకుండా దర్శకుడి ఆదేశం ప్రకారం చేసుకొంటూ పోతున్నప్పుడు క్యారెక్టర్ ఇబ్బంది పెట్టడం అనే ప్రశ్నే తలెత్తలేదు. ఆ ఇబ్బంది ఇప్పటివరకు కలగలేదు. దర్శకుడి సూచనను ఫాలో అవుతూ ఇంకా మెరుగ్గా చేసేందుకు ప్రయత్నిస్తాను. మంచి ఆర్టిస్ట్‌గా ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలడు అనిపించుకోవాలనేది నా కోరిక, ఆశ.
మీ ప్రస్థానంలో చేదు అనుభవాలు ఎదురు కాలేదా?
నిజం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, కొన్ని మరీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ చేదు నిజాలు చెపితే కొందర్ని బాధించిన వాణ్ని అవుతాను. మా నాన్నగారికి మాటిచ్చాను. నేను ఎంతో నష్టపోయాను. కష్టార్జితమంతా కాజేసినా ఆత్మస్థైర్యంతో ఉన్నాను. ఈ రోజు పోగొట్టుకొన్నా రేపు సంపాదించుకోగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఇండస్ట్రీలో ప్రతి దానికి ఓ పరిధి వుంటుంది. అది అతిక్రమించకూడదనే స్వయంగా నిర్ణయించుకోవడటంతో ఆర్థికంగా నష్టపోయాను. కొందరు వ్యక్తుల మోసానికి గురయ్యాను. ఎవరికైనా సపోర్ట్ చేయి, మంచి పేరు తెచ్చుకో అని మా అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి వున్నాను. ఎవరి వల్ల ఎంత నష్టపోయానో ఇప్పటికీ మా కుటుంబ సభ్యులకు చెప్పలేదు.
అంతలా బాధపెట్టిన విషయాలుంటే చెప్పొచ్చు కదా?
వద్దులెండి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక నిర్మాత తాను తీయబోయే 30 కోట్ల బడ్జెట్ చిత్రమని ప్లాన్ చేసి ‘ఇది గ్రాఫిక్స్‌లో ఎలా వుండబోతుందో చూద్దాం’ అని 15 రోజుల డెమో షూటింగ్ చేస్తున్నానని యాక్ట్ చేయించారు. తీరా ఒకరోజు సడెన్‌గా వచ్చి డబ్బింగ్ చెప్పమన్నప్పుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాను. విషయం ఏంటంటే ఆ 15 రోజులు తీసిన డెమో షూటింగ్‌తో సినిమా కంప్లీట్ చేసాడట. దాన్నే రిలీజ్ చేయబోతున్నాడని తెలిసి షాక్‌కు గురయ్యాను. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఒక వ్యక్తికి నా హామీతో ఫైనాన్స్ ఇప్పించాను. తీరా అతను డబ్బు చెల్లించకపోతే ఆ మొత్తం నేను చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత కమిట్‌మెంట్స్ విషయంలో జాగ్రత్తపడుతున్నాను.
సోలో హీరోగానే కొనగాగుతారా? మల్టీస్టారర్ చిత్రాల్లో చేస్తారా?
ఏమీ రూల్స్ పెట్టుకోలేదండి. శ్రీ అనే హీరోకు కూడా గుర్తింపు వచ్చింది కనుక సోలో చిత్రం అయినా ఓకే. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి అందిరికీ అన్ని వేళలా అందుబాటులో వున్నాను. నటనలో ఈజ్ వుంది, ఎలాంటి పాత్రకైనా సరిపోతాడనే ముద్ర వల్లే పెద్ద విజయాలు లేకపోయినా హీరోగా కంటిన్యూ కాగల్గుతున్నాను. మల్టీస్టారర్ చిత్రం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. క్యారెక్టర్ నచ్చితే తప్పకుండా అంగీకరిస్తాను. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలందరితో మంచి పరిచయాలే వున్నాయి. నాకు తగిన గుర్తింపు లభించే పాత్ర వస్తే యువ హీరోల చిత్రాల్లో అయినా అగ్రహీరోల చిత్రాల్లో అయినా చేయడానికైనా రెడీ.
ఇతర భాషా చిత్రాల వైపు పరుగుపెట్టే ఆలోచన వుందా?
ఈరోజు ప్రతి హీరో తన ఇమేజ్‌ను పెంచుకొంటూ దేశవ్యాప్తంగా స్పాన్ పెరగాలని కోరుకొంటున్నారు. అయితే ఇంటగెలిచి రచ్చగెలవమని పెద్దలు చెపుతారు కాబట్టి దాన్ని పాటిస్తా. తెలుగు చిత్రాలు చేస్తూనే ఇతర భాషా చిత్రాల్లో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొంటా. తెలుగు చిత్రాల్లో ఉన్నంత నేటివిటీ ఇతర భాషా చిత్రాల్లో తక్కువ. హీరో అంటే ఇలా వుండాలని తెలుగు కథకులు నిర్ణయించేసారు. అందుకే తెలుగు చిత్రం యానివర్సల్ సబ్జెట్‌గా ఏ భాషాప్రేక్షకుడికైనా నచ్చుతుంది.
ఇంతకీ మీ అభిమాన హీరో, హీరోయిన్ ఎవరు?
నాకు మహానటుడు ఎస్వీ రంగారావు గారంటే చాలా ఇష్టం. ఆయన నటించిన ప్రతి చిత్రం చూసాను. బహుముఖ ప్రజ్ఞాశాలి. విలన్, కామెడీ, క్యారెక్టర్… ఇలా ఏ పాత్ర చేసినా అదో ప్రత్యేకత కలిగివుంటాయి. హీరోల్లో నందమూరి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ గార్లు నాకు ఆదర్శం. వారి చిత్రాలు చూడటం మిస్సవ్వను. మరో రోల్‌మోడల్ షారుక్‌ఖాన్. ఆయన్ని ఫాలో అవుతుంటాను. హీరోయిన్స్ అంటారా… నటి శ్రియ, కత్రినాకైఫ్ అంటే ఇష్టం. అందరు హీరోల చిత్రాలు చూస్తాను. ఎవరు ఎలా చేస్తున్నారో గమనిస్తూ నాకొక స్టయిల్‌ను క్రియేట్ చేసుకొంటున్నాను.
ప్రస్తుతం మీ కమిట్‌మెంట్స్ ఏమిటి?
కృష్ణ దర్శకత్వం వహించబోతున్న ‘గలాటా’ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లబోతుంది. యుసమ్ క్రియేషన్స్ సంస్థ మలయాళ సినీరంగంలో అగ్రనిర్మాణ సంస్థ. ఆ సంస్థ కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నిర్మించబోయే చిత్రం చేయబోతున్నాను. నాలుగు భాషల్లో ఓ చిత్రం లభించడం నా కెరీర్‌కు ఇదో పెద్ద మలుపు అవుతుందని భావిస్తున్నాను. ఆ మేరకు నన్ను నేను తీర్చిదిద్దుకొంటూ ముందుకు పోదల్చుకొన్నాను అన్నారు వర్ధమాన హీరో శ్రీ.