సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
ఇది పీరియాడికల్ సినిమా కావడం వల్ల ఈ సినిమాలో అదిరిపోయే యుద్దాల ఎపిసోడ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం రాజమౌళి మరియు అతని టీం ఈ సినిమాలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో తీయని ఓ సరికొత్త వార్ ఎపిసోడ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్ సీక్వెన్స్ లో సుమారు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటారు. అలాగే సినిమా కోసం సెలెక్ట్ చేసిన కొంతమందికి గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలు ట్రైనింగ్ ఇస్తున్నారు.
పీటర్ హెయిన్ ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ వార్ సీక్వెన్స్ ని డిసెంబర్ తర్వాత షూట్ చేయనున్నారు, అలాగే ఈ సీక్వెన్స్ ని సుమారు రెండు నెలలపాటు చిత్రీకరించనున్నారు. ఈ విషయంపై వివరాలను త్వరలోనే రాజమౌళి అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.