చాలా చిన్న గ్రామం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన టాలెంట్ ద్వారా డైలాగ్ కింగ్ అనిపించుకున్న డా. మోహన్ బాబు. అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, ఆ తర్వాత ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా అలుపెరగని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మోహన్ బాబు ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమై 38 ఏళ్ళు పూర్తీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించి చెబుతూ ‘ నా కెరీర్ మొదట్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు 6 నెలలకి 50 రూపాయలు ఇచ్చేవారు. అలా అసిస్టెంట్ పనిచేస్తూ వేషాల కోసం ట్రై చేసేవాన్ని, అప్పట్లో ఎప్పటికైనా నెంబర్ 1 ప్రతినాయకుడిని కావాలనేదే నా లక్ష్యం’ అని అన్నారు.
మీకు నోటి దురుసు ఎక్కువ అని అంటుంటారు దీనిపై మీ కామెంట్ ఏంటని అడిగితే ‘ ఎవ్వరిని అడిగినా మోహన్ బాబు ముక్కుసూటి మనిషి, కరెక్ట్ మనిషి అంటారు. మీరేమో నోటి దురుసు అంటున్నారు అది తప్పు. ఎందుకంటే సందర్భం లేకుండా ఎవరిమీద పడితే వారిమీద నోరు పారేసుకుంటే దాన్ని నోటి దురుసు అంటారు. నేను తప్పు చేసిన వాళ్ళ గురించే మాట్లాడతాను. ఎవడో ఒకడు మోహన్ బాబుకి నోటి దురుసు అంటాడు, అలా అన్నవాడికే నోటి దురుసెక్కువని’ మోహన్ బాబు సమాధానం ఇచ్చారు.