పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియోని నిన్న గ్రాండ్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘సినిమాలలో నటించడమే తప్ప ఇలాంటి వేడుకలకు రావడం నాకు ఇష్టం ఉండదు. కారణం నా అభిమానులు నాకు ఆత్మీయులతో సమానం అలాంటి వారు ఇబ్బంది పడకూడదనే నేను ఇలాంటి ఫంక్షన్ లకి దూరంగా ఉంటాను. కానీ ఈ సారి నన్ను ఒప్పించారు. అభిమానులకు నా మీద ఎంత ప్రేమ, అభిమానం ఉందో అంతకు రెట్టింపు ప్రేమ నాకు వారి మీదా ఉందని’ అన్నాడు.
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ‘ నేను ‘జానీ’ సినిమా పరాజయం తరువాత సినిమా కథలు వినడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒక రోజు త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పాడు. నేను కథ వింటూ నిద్రపోయాను. ఆయన విసుకోకుండ నవ్వుతూ వెళ్ళిపోయాడు. అప్పట్లో అంతగా అలసిపోయాను. ఆ తరువాత ఆయనతో కలిసి ‘జల్సా’ సినిమా చేయడం జరిగింది’ అని అన్నాడు.
‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.