విడుదల తేదీ : నవంబర్ 21, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు
దర్శకుడు : సాయిలు కంపాటి
నిర్మాతలు : వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : వాజిద్ బేగ్
ఎడిటర్ : నరేష్ అడుప
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన లవ్ డ్రామా రాజు వెడ్స్ రాంబాయి కూడా ఒకటి. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
2010 సమయం ఒక మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు (అఖిల్ రాజ్) అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి (తేజస్వి రావు) ని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. కానీ రాజు తండ్రి రమేష్ (శివాజీ రాజా) తన కొడుకును హైదరాబాద్ పంపి వేరే పని ఏదో చేసుకోవాలని ఆశపడతారు. ఇంకోపక్క రాంబాయి తండ్రి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) తన కూతురికి కేవలం గవర్నమెంట్ సంబంధం చెయ్యాలని చూస్తాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ ఈ యువ జంట ప్రేమకథ ఎలా సాగింది? ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది? ఆ మధ్యలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? తన సొంత కూతురుకే వెంకన్న తలపెట్టిన హాని ఏంటి? చివరికి వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రం యధార్థ సంఘటన ఆధారంగా తీసుకున్నది కాబట్టి ఇందులో కోర్ పాయింట్ ఆడియెన్స్ ని కదిలించేలానే ఉంటుంది. అలాగే దీనికి అనుగుణంగా కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ ట్రాక్స్ వరకు కూడా పర్వాలేదు. యువ హీరో హీరోయిన్స్ అఖిల్ రాజ్, తేజస్విలు రాజు, రాంబాయి అనే లవర్స్ లా అందులో జీవించారు.
ఒక మారుమూల గ్రామంలోని ఇనోసెంట్ లవర్స్ గా వీరి కెమిస్ట్రీ సినిమాలో బాగుంది. అలాగే ఫస్టాఫ్ లో ఇంకా క్లైమాక్స్ పోర్షన్ లో ఇద్దరి మధ్యలో సీన్స్ బాగున్నాయి. ఇక వీటితో పాటుగా అక్కడక్కడా వింటేజ్ కామెడీ సీన్స్ డీసెంట్ ఫన్ ని జెనరేట్ చేసాయి.
నటుడు శివాజీ రాజా తన పాత్రలో మంచి పెర్ఫామెన్స్ చేశారు. అలాగే నెగిటివ్ పాత్రలో చైతూ జొన్నలగడ్డ దాదాపు ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వీరితో పాటుగా హీరో ఫ్రెండ్స్ గా కనిపించిన ఫ్రెండ్స్ తమ పాత్రల్లో బాగా చేశారు.
వీటితో పాటుగా ఈ సినిమా యువతకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే నిజమైన ప్రేమని ఫీల్ అవుతారో, తమ ప్రేమ కోసం ఎంతవరకు అయినా వెళ్ళాలి అనుకుంటారో వారిని ఈ సినిమా మరింత కదిలిస్తుంది. నిజంగా ఇలాంటి ఒక క్లైమాక్స్ బయట జీవితంలో జరిగిందా అనే విధంగా సినిమాలో క్లైమాక్స్ చాలా మందిని ఆశ్చర్యపరచవచ్చు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో మెయిన్ డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది సాగదీతగా సాగే కథనం అని చెప్పాలి. నిజ జీవిత ఘటనలే కాబట్టి మంచి ఎమోషన్ ఇందులో ఉంది కానీ దానిని సినిమాగా మలిచే ప్రయత్నం మాత్రం అంత ఇంట్రెస్ట్ గా సాగలేదు. కథనాన్ని బాగా డ్రాగ్ చేసి ఫ్లో ని బోర్ గా నడిపించారు.
కొన్ని కొన్ని సన్నివేశాలు తగ్గించి కేవలం మెయిన్ పాయింట్ పైనే సినిమా గ్రిప్పింగ్ గా సాగించి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని పాత్రలు డిజైన్ కూడా ఇంకా బెటర్ గా చేయాల్సింది. వెంకన్న పాత్ర నెగిటివ్ అయినప్పటికీ అంత ఆర్క్ అందులో కనిపించదు. ఇంకా స్ట్రాంగ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది.
అలాగే మధ్యలో శివాజీ రాజా రోల్ పై ఎమోషనల్ ఎండింగ్ ఆ సీన్స్ అంతా చాలా సింపుల్ గానే వెళ్లిపోయాయి. ఇంకా అవే కాకుండా ఈ సినిమా చూస్తున్న క్రమంలో ఒక పాయింట్ కి వచ్చేసరికి ఇలాంటి ప్రేమ కథలు చాలానే ఉంటాయి కదా అనిపిస్తుంది. కేవలం ఆ క్లైమాక్స్ పాయింట్ కోసం మిగతా సినిమా అంతా ఇంత సాగదీయాలా అనే ఫీల్ కలుగుతుంది. ఇంకా కొన్ని కొన్ని సీన్స్ రిపీటెడ్ గా సీరియస్ సన్నివేశాల్లో ఇరిటేట్ చేసే విధంగా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. అక్కడక్కడా చిన్నపాటి వి ఎఫ్ ఎక్స్ లాంటివి కనిపించాయి. కానీ మిగతా సినిమా సెటప్ అంతా క్లీన్ గా ఉంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. వాజిద్ బైగ్ కెమెరా వర్క్ బాగుంది. నరేష్ అదుప ఎడిటింగ్ లో చాలా వరకు సీన్స్ తగ్గించాల్సింది. లవ్ ట్రాక్ లో అనవసర ల్యాగ్ సీన్స్ ని తగ్గించి మెయిన్ ఎమోషన్ కి తగ్గట్టుగా బెటర్ కథనంతో కట్ చేయాల్సింది.
ఇక దర్శకుడు సాయిలు కాంపాటి విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కథ బాగుంది. నిజ జీవిత సంఘటన అందులోని ఒక హార్డ్ హిట్టింగ్ అంశంని తాను తెరకెక్కించే ప్రయత్నంలో కథనాన్ని బాగా సాగదీతగా తాను ప్లాన్ చేసుకున్నారు. కొంచెం ఆ సీన్స్ ని తగ్గించుకుని ఉంటే ఈ సినిమా కొంచెం బెటర్ ఫీల్ ని ఆడియెన్స్ కి కలిగించి ఉండేది. లీడ్ జంట మధ్య ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అనే అంశాన్ని తాను బాగా చూపించారు. అలాగే కొన్ని ఎమోషన్స్ కూడా బాగానే రాబట్టారు. కాకపోతే ఇదే టెంపో ఆద్యంతం కొనసాగించి ఉంటే ఈ ప్రేమకథకు మరింత వెయిట్ అందించి ఉండేది. ఓవరాల్ గా తన వర్క్ బాగానే ఉంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ ‘రాజు వెడ్స్ రాంబాయి’ లో లీడ్ జంట మధ్య లవ్ ట్రాక్ ప్రేమికులని కదిలిస్తుంది. అలాగే అక్కడక్కడా కామెడీ సీన్స్ నవ్విస్తాయి. ఇక ఆ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ పోర్షన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. కానీ మెయిన్ పాయింట్ కోసం మిగతా సినిమా కొంచెం సాగదీతగా నడిపినట్టు అనిపిస్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక నిజమైన ఎమోషనల్ ప్రేమకథని చూడాలి అనుకునేవారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


