మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ‘వసుదేవసుతం’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ పాటను యువ కథానాయకుడు ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించారు. ‘వసుదేవసుతం దేవం’ అనే పల్లవితో సాగే ఈ గీతానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చారు. ఈ పాటను పవన్-శృతిక సముద్రాల ఆలపించారు.
టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట, గ్రామీణ వాతావరణం, ఆలయ సన్నివేశాలు కలర్ఫుల్గా ఆకట్టుకున్నాయి. మణిశర్మ అందించిన ట్యూన్ మరో చార్ట్ బస్టర్‌గా నిలిచేలా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. పాట విడుదల అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ, పాట చాలా బాగుందని, మణిశర్మ సంగీతం, చైతన్య ప్రసాద్ సాహిత్యం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. మాస్టర్ మహేంద్రన్ అద్భుతమైన నటుడని పేర్కొంటూ, చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రాన్ని వైకుంఠ్ బోను దర్శకత్వంలో, ధనలక్ష్మి బాదర్ల రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పకులుగా వ్యవహరించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.


