భారతీయ సినిమా సినిమా తాలూకా గతిని, దిశని మొత్తం భారతీయ సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా మొట్టమొదటి వరుసలో ఉండే సినిమాలు బాహుబలి సిరీస్ అని చెప్పాలి. ఈ రెండు సినిమాలు తర్వాత భారతీయ సినిమా అంతకుముందు ఆ తర్వాత అన్నట్టుగా పరిస్థితులు మారాయి.
అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని థియేటర్స్ లో అందించిన రాజమౌళి అండ్ టీం ప్రయత్నం మరోసారి థియేటర్స్ లో అలరించేందుకు వచ్చింది. అయితే ఈ కరోనా పాండమిక్ తర్వాత రీరిలీజ్ సినిమాలు హావా బాగా పెరిగింది. ఆ కోవ లోనే ఈ సినిమా కూడా రీ రిలీజ్ కి వచ్చింది అనుకుంటే పొరపాటే..
ఎందుకంటే రాజమౌళి సాదాసీదాగా ఈ రిలీజ్ ని తీసుకోలేదు ఒక్కో పార్ట్ ని ఒక్కొక్కసారి రిలీజ్ చేయడం కాకుండా రెండు సినిమాలు కలిపి ఒక్క సినిమాగా “బాహుబలి ది ఎపిక్” అంటూ సింగిల్ పార్ట్ సినిమాగా రీ రిలీజ్ లో కూడా కొత్తవరబడి సృష్టించి పాన్ ఇండియా లెవెల్ లో మళ్ళీ సత్తా చాటేందుకు తీసుకొచ్చారు. ఈసారి వచ్చిన సినిమా ఎలా ఉంది ఏంటి ఈసారి థియేటర్స్ లో ప్రేక్షకులకి రాజమౌళి ఎలాంటి ట్రీట్ ని అందించారు అనేది ఈ పునఃసమీక్షలో సారాంశం.
ఇప్పటికీ రాజమౌళిని ఎందుకు జక్కన్న అని పిలుస్తారు
ఒక సీరియల్ దర్శకునిగా మొదలై ఇప్పుడు వెండి తెర దగ్గర యావత్తు భారతదేశం సినిమా నంబర్ వన్ దర్శకుడుగా కిరీటం అందుకున్నారు అంటే దాని వెనుక ఎంతో పట్టిన తో కూడిన కృషి ఉంది. తాను చేసేది చిన్న ఈగతో అయినా భారీ సెట్టింగ్లు వేసి మాహిష్మతి లాంటి ఫిక్షనల్ రాజ్యాన్ని సృష్టించి చేయాలన్నా తనలో ఒక మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఉంటే తప్ప జరగదు. కథ తాను రాసుకోకపోయినప్పటికీ ఆ కథని తీర్చిదిద్దే విధానమే రాజమౌళిని జక్కన్నగా పిలిచేలా చేసింది. ప్రతి నటుడు ప్రతి సన్నివేశం వాటి తాలూకా భావోద్వేగాలు ఎక్కడ ఎంత ఉండాలో తాను చెప్పే విధానమే ఎప్పటికీ జక్కన్నగా పిలిచేలా చేస్తుంది. అందుకు తార్కానంగా మరోసారి ఈ బాహుబలి ది ఎ పిక్ తాలూకా వర్క్ చూస్తే అర్థమవుతుంది.
ఒక సరికొత్త ఆరంభం:
ఇప్పుడు కథ నేరుగా శివగామి (రమ్య కృష్ణ) రహస్య గుహ నుండి బయటకు వచ్చి, శిశువును చేతుల్లో మోసుకెళ్లడం నుంచే మొదలవుతుంది. సైనికుల నుంచి ఆమె తప్పించునే ప్రయత్నం అందులోని భావోద్వేగాలు అలానే ఉన్నాయి. ఈ వెంటనే శివుడు (చిన్న బాహుబలిగా ప్రభాస్) చిన్ననాటి సన్నివేశాలను సెట్ చేశారు.
అక్కడ నుంచి శివుడు తన తల్లి (రేవతి) కోసం శివలింగాన్ని ఎత్తడం, తరువాత చెక్క ముసుగును కనుగొనడం, ఆ తర్వాతే “అక్కడ ఏముంది అమ్మా?” అని అడగడం చూపిస్తాడు. ఈ మలుపు ఆ సన్నివేశానికి ఒక సహజ రహస్యాన్ని ఇస్తుంది, బాలుడు ప్రశ్న అడగకముందే అతని విధి పిలుస్తున్నట్లుగా.. చూపించాక వెంటనే “ధీవర” పాటలోకి కట్ అవుతుంది.
అవంతిక చాప్టర్ కి కొత్త రూపం
అసలు బాహుబలి కథంతా మొదలుకావడానికి ముఖ్య కారణాలలో శివుడు, అవంతికను వెతుక్కుంటూ వెళ్లడం కూడా ఒకటి. తనకు దొరికిన చెక్క మొఖం వెనుక ఉన్న అసలు ముఖం ఎవరిది అనేది తెలుసుకోవడానికి వెళ్లకపోయి ఉంటే ఈ బాహుబలి కథ మరోలా ఉండేదేమో?
అయితే ఈ బాహుబలి ది ఎపిక్ లో అవంతిక చాప్టర్ కి ఒక సింపుల్ కోణాన్ని సృష్టించారు. స్వయంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన వాయిస్ ఓవర్ తో శివుడు అవంతిక తాలూకా లవ్ చాప్టర్ ని చెప్పి తేల్చేశారు. అసలు అవంతిక ఎవరు ఆమె లక్ష్యం ఏమిటి చెవుడు ఆమెను ఎలా కలిశాడు. వారి ప్రేమ కథ వంటివి రాజమౌళి తన మాటల్లో చెప్పారు.
ఈ క్రమంలో ఈ టోటల్ లవ్ స్టోరీ తాలూకా విజువల్స్ పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి తొలగించగా హిమ పాతం వచ్చే అడ్వెంచర్స్ సీన్ మాత్రం చిన్న కట్ తో చూపించారు. అలాగే కట్టప్ప పరిచయం అస్లాన్ ఖాన్ సన్నివేశాలు పూర్తిగా ఇందులో తొలగించబడ్డాయి.
మాహిష్మతి మరియు బాహుబలి పరిచయం
శివుడు మాహిష్మతికి పయనం కావడంతోనే మహా సామ్రాజ్యం మాహిష్మతి ప్రపంచంలోకి ప్రేక్షకులు కూడా వెళ్ళిపోతారు. ఈ ఎపిక్ కట్ వెర్షన్ లో మాత్రం పనులు అన్నీ మరింత వేగంగా వెళ్లిపోతాయు. భల్లాల దేవుడి క్రూరత్వం, మాహిష్మతి ప్రజలు పడే బాధలు సీన్స్ లాంటివి తగ్గించబడ్డాయి.
కానీ బాహుబలి మళ్లీ తిరిగి వచ్చాడు అనే పవర్ఫుల్ ఎమోషన్ ని మాత్రం ఇందులో అంతకు మించిన విధంగా క్యారి చేయడం జరిగింది. భల్లాలుడి 100 అడుగుల బంగారు విగ్రహం తాలూకా హైలైట్ సీన్ ఈ క్రమంలో అవంతిక, దేవసేన లపై కొన్ని సన్నివేశాలు తగ్గించబడ్డాయి.
ఇక వీటి తర్వాత దేవసేనని శివుడు కాపాడే సీక్వెన్స్ మొత్తం ఎంత ఉద్వేగభరితంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ ఎమోషన్ పక్కదారి పట్టకుండా తీసుకెళ్తూ ఐకానిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ కట్టప్ప బాహుబలి కాలు తీసుకొని తన శిరస్సుపై పెట్టుకునే సీన్ వరకు హై మొమెంట్స్ తో కొనసాగుతుంది.
ఈ తరువాత కాలకేయునితో యుద్ధ సన్నివేశాలు కొంచెం తగ్గించబడ్డాయి కానీ రాజమౌళి తీసుకున్న కేర్ అండ్ టేకింగ్ బాగుంది. ఇక అక్కడ నుంచి బాహుబలిని కట్టప్ప చంపే సీన్ తో ఇంటర్వెల్ కి చేరుకుంటుంది కానీ ఇక్కడే రాజమౌళి మార్క్ ఫన్ ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
రెండవ భాగం ఎలా సాగింది:
రెండవ భాగం ‘ది కన్‌క్లూజన్’ యొక్క మరింత కఠినమైన వెర్షన్‌తో ప్రారంభమవుతుంది అని చెప్పాలి. మహిష్మతి సంప్రదాయాన్ని గుర్తుచేసే ఆరంభ సన్నివేశాన్ని తగ్గించారు అలాగే సాహోరె బాహుబలి పాట కూడా కొంతమేర తగ్గించారు.
అమరేంద్ర బాహుబలి కోసం శివగామి భాగస్వామిని వెతకడం ప్రారంభించే సన్నివేశం వంటివి వేగంగా వెళ్తాయి. బాహుబలి మరియు కట్టప్ప రాజ్యంలో తిరుగుతున్నట్లు చూపించే సన్నివేశాలను మరింత పదునైన కథనం కోసం కత్తిరించారు.
తరువాత కుంతల రాజవంశ రాణి దేవసేన పరిచయం అవుతుంది. ఆమె ఎంట్రీ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు ఉంది. బాహుబలి, కట్టప్ప కుంతల లోకి వెళ్ళాక కొన్ని సన్నివేశాలు తొలగించబడ్డాయి. కానీ రాజమౌళి ఆశ్చర్యకరంగా అడవి పంది వేట సన్నివేశాన్ని ఉంచారు. అలాగే కట్టప్ప జానపద గేయం, కన్నా నిదురించారా సాంగ్స్ పూర్తిగా తొలగించబడ్డాయి.
ఇక ఆ తర్వాత నుంచి కథనం పూర్తిగా సీరియస్ టోన్, ఎమోషనల్ గా మారుతుంది. బాహుబలి కుంతల సామ్రాజ్యాన్ని కాపాడడం, తన అసలు గుర్తింపు బయట పడటం నుంచి దేవసేనతో ప్రయాణం ఉన్నాయి. అయితే రాజమౌళి ఇక్కడ కేవలం అంచులు మాత్రమే తొలగించారు.
ఇక వీటితో పాటుగా అమరేంద్ర బాహుబలిని హతమార్చాలనే భావోద్వేగపూరిత మూమెంట్స్, శివగామి పశ్చాత్తాపం, మహేంద్ర బాహుబలి తిరుగుబాటు ఇంకా భల్లాల దేవతో పోరాట సన్నివేశాలు మరింత హై ఎండ్ గా వెంట వెంటనే కనిపిస్తాయి. ఇక్కడా కొన్ని సన్నివేశాలు తగ్గించి సింపుల్ గా థాంక్స్ కార్డ్ తో జక్కన్న ముగించడం జరిగింది.
ఏముంది? ఏం లేదు?
ఈ రెండు పార్ట్ ల కలయికలో దాదాపుగా మొదటి భాగానికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా తగ్గించబడ్డాయి. అవంతిక ఎపిసోడ్, యుద్ధ సన్నివేశాలు ఇంకా కామెడీ సీన్స్, పాటలు లాంటివి తొలగించబడ్డాయి. కానీ కీలకమైన రాజమౌళి మార్క్ ఎమోషనల్ పార్ట్ ని చెదరకుండా ఉండేలా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.
మొత్తనికి నెరవేరిన రాజమౌళి కల:
అసలు ఇప్పుడు వరుసగా కొనసాగుతున్న సీక్వెల్స్ పర్వానికి నాంది పలికింది జక్కన్న రాజమౌళి. కానీ అదే రాజమౌళికి మొదట ఉన్న ఆలోచనలో అసలు రెండు భాగాలు అనే మాట లేదు. ఎప్పుడో 2012 లో వేసుకున్న ప్రణాళికలు ప్రకారం ఈ సినిమా కేవలం ఒక్క భాగం గానే పూర్తి చేసుకోవాలి అనేదే పేపర్ పై ఉన్నది.
కానీ కాల క్రమేణా అది మారి రెండు భాగాలు అయ్యింది. కానీ మళ్లీ అదే కాల క్రమేణా విధి రాజమౌళికి మరోసారి సహకరించి తను మొదట అనుకున్నట్లుగానే ఒక్క సినిమాగా బాహుబలి తిరిగొచ్చింది. ఇలా తన కల నెరవేరింది అని చెప్పాలి.
ఆ రెండు చిత్రాలకు మరింత సృజనాత్మక, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత బెటర్ ఔట్ పుట్ ని జక్కన్న అందించారు. ప్రతీ ఫ్రేమ్ ఎంతో అందంగా గ్రాండ్ గా కన్నులకి విందుగా చూపించి మరో సారి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు చేశారు.
చివరి మాటగా:
ఈ బాహుబలి ది ఎపిక్ అనేది ఏదో రెండు భాగాలు నుంచి అక్కడక్కడా అతికించిన సినిమా అయితే కాదు. ఆ రెండింటి నుంచి పుట్టుకొచ్చిన ఒక పూర్తి కొత్త సినిమాకి రూపం ఉంటే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంది. మళ్లీ పాత జ్ఞాపకాలను నెమరు వేసే విధంగా మరింత బెటర్ సౌండ్, విజువల్స్ తో ముఖ్యంగా రాజమౌళి విజన్ లు దాదాపు ఈ 4 గంటల సినిమాని ఒక సరికొత్త ఎక్స్ పీరియెన్స్ గా ప్రేక్షకులకు అలరిస్తాయి. నిజానికి ఇది అసలు బాహుబలి కథకి పూర్తి ప్రతిరూపం. సో ఈ ఎపిక్ ట్రీట్ ని సరైన థియేటర్స్ లో ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి.


