ఇదంతా మీ అందరివీ, మీరందించినవి – మెగాస్టార్

ఇదంతా మీ అందరివీ, మీరందించినవి – మెగాస్టార్

Published on Sep 22, 2025 7:00 PM IST

chiru

మెగాస్టార్ చిరంజీవి తన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై నేటికి 47 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా చిరంజీవి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ చిరు తన పోస్ట్ లో ఏం రాశారు అంటే… ‘22 సెప్టెంబర్‌ 1978.. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో మీకు పరిచయమయ్యాను. ఈ సినిమా విడుదలై నేటికి 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ సినిమా ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’ అని చిరు తెలిపారు.

మెగాస్టార్ తన పోస్ట్ లో ఇంకా రాస్తూ.. ‘నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే.. అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్‌లో తెలిపారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ విడుదలై 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరుకు సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు