Shefali Jariwala’s death probe: అందమే శాపమైందా? ‘కాంటా లగా’ బ్యూటీ షెఫాలీ జరీవాలా మృతి వెనుక షాకింగ్ నిజాలు!

Shefali Jariwala’s death probe: అందమే శాపమైందా? ‘కాంటా లగా’ బ్యూటీ షెఫాలీ జరీవాలా మృతి వెనుక షాకింగ్ నిజాలు!

Published on Jun 30, 2025 10:16 PM IST

‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి, మోడల్ షెఫాలీ జరివాలా (42) జూన్ 27న అనూహ్యంగా మృతి చెందారు. ఆమె మరణం చుట్టూ అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందం కోసం వాడే మందులు, డైట్ వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించగా, విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంట్లో రెండు బాక్సుల మందులు – పోలీసుల కీలక గుర్తింపు
షెఫాలీ మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు బాక్సుల నిండా మందులు లభించాయి. వాటిలో యాంటీ-ఏజింగ్ మాత్రలు, చర్మం మెరిపించే స్కిన్ గ్లో ఇంజెక్షన్లు, ముఖ్యంగా గ్లూటాథియోన్ వంటి శక్తివంతమైన ఔషధాలు ఉన్నట్లు గుర్తించారు.

ఖాళీ కడుపుతో గ్లూటాథియోన్ ఇంజెక్షన్
షెఫాలీ మృతి చెందిన రోజు ఉపవాసం పాటిస్తూ పూజలో పాల్గొన్నారు. అదే రోజు ఖాళీ కడుపుతో గ్లూటాథియోన్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇది ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్టు అనుమానిస్తున్నారు.

డాక్టర్ల ప్రాథమిక అభిప్రాయం
పోలీసులు సేకరించిన మందుల వివరాలను వైద్యులతో పంచుకున్నారు. డాక్టర్ల ప్రాథమిక అంచనా ప్రకారం, ఖాళీ కడుపుతో ఇలాంటి శక్తివంతమైన మందులు తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి, గుండెపై తీవ్ర ఒత్తిడి వచ్చి, గుండెపోటుకు దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు.

మరణానికి అసలు కారణం..?
ప్రస్తుతం పోలీసులు ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే షెఫాలీ మరణానికి అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. ఆమె వాడిన మందుల నమూనాలను కూడా ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపారు.

అందాన్ని కోరుతూ వాడిన మందులే షెఫాలీ ప్రాణాలను బలిగొన్నాయా? అన్న ప్రశ్నకు త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ఘటన అందం కోసం అనవసరంగా మందులు వాడే వారందరికీ హెచ్చరికగా నిలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు