ఓటీటీ సమీక్ష : పంచాయత్ సీజన్ 4 – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష : పంచాయత్ సీజన్ 4 – అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సిరీస్

Published on Jun 24, 2025 8:01 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 24, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్, సాన్వికా, దుర్గేష్ కుమార్, సునీత రజ్వర్, అశోక్ పాఠక్, పంకజ్ ఝా తదితరులు
దర్శకత్వం : అక్షత్ విజయ్‌వర్గియ, దీపక్ కుమార్ మిశ్రా
నిర్మాతలు : ప్రజేష్ మిశ్రా, శ్రేయాన్ష్ పాండే, విజయ్ కోషి, అరునబ్ కుమార్, సయ్యద్ జయిద్ అలీ, జోహేబ్ అలీ
సంగీత దర్శకుడు : అనురాగ్ సాయికియా
సినిమాటోగ్రాఫర్ : అమితాభ సింగ్
ఎడిటర్ : అమిత్ కుల్కర్ణి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హిందీలో బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ పంచాయత్, ఇప్పుడు నాలుగో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఫులేరా గ్రామంలో టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ సచివ్ జీ అభిషేక్ త్రిపాఠీ(జితేంద్ర కుమార్) CAT పరీక్షలపై ఫోకస్ పెడతాడు. తుపాకి దాడి నుంచి తప్పించుకున్న ప్రధాన్ జీ బ్రిజ్ భూషణ్(రఘుబీర్ యాదవ్) ఎమ్మెల్యే చందు సింగ్(పంకజ్ ఝా) మరియు భూషణ్(దుర్గేష్ కుమార్)లపై కేసు నమోదు చేస్తాడు. ఈ క్రమంలో భూషణ్‌ను దూషించాడనే కేసును ఎదుర్కొంటాడు అభిషేక్. అయితే, అతడికి క్షమాపణలు చెప్పాలని అభిషేక్ ప్రయత్నించగా భూషణ్ తనకు ఓ పని చేయాలని డిమాండ్ చేస్తాడు. ఈ క్రమంలో భూషణ్, ప్రధాన్ జీ ల మధ్య ఎలాంటి పొలిటికల్ శత్రుత్వం ఏర్పడుతుంది..? ఇది ఎక్కడికి దారి తీస్తుంది..? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ వెబ్ సిరీస్ తనదైన గ్రామీణ నేనథ్యంతోనే సాగుతుంది. జితేంద్ర కుమార్ మరోసారి చక్కటి పర్ఫార్మెన్స్ అందించాడు. వెబ్ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో అతని పాత్ర కీలకంగా ఉంటుంది. ఆయనకు తోడుగా గ్రామీణ నేపథ్యంలోని పలు పాత్రలు కూడా బాగా చేశారు.

భూషణ్ పాత్రలో దుర్గేష్ కుమార్ ఈ సీజన్‌కు మరో బలంగా నిలిచాడు. గ్రామంలో సమస్యలు సృష్టించే పాత్రలో అతడి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అతడి భార్య క్రాంతి దేవి పాత్రలో సునీతా రజ్వర్ కూడా కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది.

ప్రధాన్ జీ పాత్రలో రఘుబీర్ యాదవ్ మరోసారి మెరిశారు. మంజు దేవి పాత్రలో నీనా గుప్తా, ప్రహ్లాద్‌గా ఫైజల్ మాలిక్, బినోద్‌గా అశోక్ పాఠక్ చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. వీరి మధ్య వచ్చే కెమిస్ట్రీ ఈ వెబ్ సిరీస్‌కు కలిసొచ్చింది.

లడ్డూల కోసం జరిగే గొడవ, రాత్రి భోజనం దగ్గర మరొకటి, ఐటీ రైడ్, ఎమ్మెల్యే చేసే ఎటకారం వంటి సీన్స్ ఈ వెబ్ సిరీస్‌కు బలంగా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ :

మంచి నేపథ్యం, ఆకట్టుకునే పాత్రలు ఉన్నప్పటికీ ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. గత సీజన్లు తమదైన కామెడీతో ప్రేక్షకుల్లో మంచి మార్క్ వేసుకోగా.. ఈ సీజన్ మాత్రం రాజకీయం నేపథ్యంలో సాగడంతో అసలైన ఎమోషన్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది.

కొన్ని ఎపిసోడ్స్ వరకు పర్వాలేదనిపించినా, ఆ తర్వాత కథ సాగదీతగా మారిపోతుంది. కథనం నెమ్మదించడంతో చాలా సీన్స్ సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కథ కూడా ఎలాంటి ట్విస్టులు లేకుండా చప్పగా సాగుతుంది. కథలో డెప్త్ కూడా లేకపోవడం, కామెడీ కూడా పెద్దగా నవ్వించకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు.

రింకీ పాత్రలో సాన్విక నటన ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. ఆమె పాత్రను కూడా చాలా తేలికగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆమె పాత్రను సరిగా రాసుకుని ఉంటే ఈ కథకు మరింత బలంగా మారేది.

ఈ సీజన్‌ను ముగించిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పించదు. వారిలో చాలా ప్రశ్నలు తలెత్తేలా ఈ సీజన్ ముగింపు ఉంటుంది.

సాంకేతిక విభాగం :

అక్షత్ విజయ్‌వర్గియ, దీపక్ కుమార్ మిశ్ర డైరెక్ట్ చేసిన ఈ సీజన్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. చందన్ కుమార్ రైటింగ్ కూడా గత సీజన్ల మాదిరిగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. స్కీన్ ప్లే లో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. అమితాభ సింగ్ సినిమాటోగ్రఫీ వర్క్ గత సీజన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంది. ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. చాలా సీన్స్ సాగదీతగా అనిపించడంతో వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా ఉన్నా, పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, పంచాయత్ సీజన్ 4 రాజకీయాల చుట్టూ తిరిగే కథతో రావడంతో ఎమోషనల్‌గా ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. జితేంద్ర కుమార్, దుర్గేష్ కమార్ తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. స్లో పేస్, ఊహించినంత కామెడీ లేకపోవడం తదితర అంశాలు ఈ సీజన్‌కు డ్యామేజ్ చేశాయి. ఈ వెబ్ సిరీస్‌ను ఓపికగా తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు