ఇంటర్వ్యూ: డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి – ‘8 వసంతాలు’లో ఎమోషన్స్ డీప్ గా కనెక్ట్ అవుతాయి

ఇంటర్వ్యూ: డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి – ‘8 వసంతాలు’లో ఎమోషన్స్ డీప్ గా కనెక్ట్ అవుతాయి

Published on Jun 18, 2025 2:00 AM IST

పాన్ ఇండియా లెవెల్లో వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ చిత్రం ‘8 వసంతాలు’. ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది కదా… ఇంత టైం పట్టడానికి కారణం?

కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ మెయిన్ ప్రాయారిటీ. స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలని అనిపించింది. మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల చాలా బలమైన స్త్రీ పాత్రల మధ్య పెరిగాను. ఎప్పటినుంచో ఆ దృక్కోణం ఉంది. ఈ ఫిల్మ్ తో ఒక పూర్ణస్థాయి తీసుకోవాలనిపించింది.

ఇంత బరువైన పాత్ర కోసం అనంతిక సునీల్‌కుమార్‌ను ఎంపిక చేయడానికి కారణం?

నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. తను ఈ పాత్రను ఎలా చేస్తుందో అనే డౌట్ ఎప్పుడూ లేదు. తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది. శుద్ధి అయోధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

టీజర్, ట్రైలర్‌లో వాడిన భాష, కవిత్వం ఇప్పటి జెన్‌జీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందా?

మేము గ్రాంధికం వాడలేదు. ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం’ అని ఓ డైలాగ్ ఉంది. ఇందులో గమ్యం, ప్రయాణం పేర్లతో సినిమాలు వచ్చాయి. మేము కొత్తగా తీసుకొచ్చినవి ఏమీ లేవు. సినిమాలో రెండు పాత్రలు కూడా రచయితలే. ఆ పాత్రలు సహజసిద్ధంగా అలానే మాట్లాడుతాయి. భాషను బ్రతికించే శక్తి సినిమాకే ఉంది. సినిమాకి ఒక పవర్ ఉంది. ఎవరో ఒకరు ఆ భాష చూసి ఇష్టాన్ని పెంచుకోవచ్చు. నేను ఒక ప్రయత్నం చేశాను. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారు.

‘8 వసంతాలు’ ట్రైలర్ చూసిన తర్వాత రెండు ప్రేమకథలు కనిపించాయి… ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పబోతున్నారు?

ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన నిలదొక్కుకుంటుంది. ప్రేమ రెండు దశల్లో జరుగుతుంది. 19 ఏళ్లలో జరిగే ప్రేమ, 27 ఏళ్ల వయసులో జరిగే ప్రేమలో తను మానసికంగా ఉన్న తేడాను చాలా సున్నితంగా ఎక్స్‌ప్లోర్ చేయాలని అనుకున్నాను. దానికి తోడు గురుశిష్య పరంపరను కూడా చూపించాలని అనుకున్నాను. అలాగే తన చుట్టుపక్కల పాత్రల నుంచీ తన క్యారెక్టర్ ఎక్స్‌ప్లోర్ చేయాలని భావించాను. ఆ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మృదుత్వాన్ని కోల్పోదు.

ఇలాంటి పాత్రలు రాసినప్పుడు మీకు స్ఫూర్తి?

బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా ఉంటాయి. అవి ఎక్కడినుంచైనా రావచ్చు.

లొకేషన్స్ బావున్నాయి.. ఎలాంటి ప్రదేశాల్లో షూట్ చేశారు?

కశ్మీర్, కన్యాకుమారి, ఊటీ, ఆగ్రా.. ఇలా చాలా అద్భుతమైన లోకేషన్స్‌లో షూట్ చేశాం. కథే తీసుకెళ్లింది. ‘మను’కి పని చేసిన విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు?

కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘మను’ చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌లో ఫిల్మ్ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ రెండింటి సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత డిసైడ్ చేసుకుంటాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు