అల్లు అర్జున్ కు యువతలోనే కాదు అన్ని వర్గాల్లోనూ అభిమానులున్నారు. పెద్దవాళ్ల, పిల్లల్లో ఆయన క్రేజ్ భారీ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే బన్నీ స్టైల్, డ్యాన్సులు అంటే ఎంతో ఇష్టం. ఆయన్ను చూసి డ్యాన్సులు నేర్చుకునే పిల్లలు చాలామందే ఉన్నారు. అలాంటి ఒక అభిమాని కోరికను ఈరోజు క్రిస్మస్ సందర్బంగా బన్నీ తీర్చారు. సమీర్ అనే పిల్లాడికి ఎప్పటికైనా బన్నీ నుండి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలనేది కోరికట. ఆ కోరికను తెలుసుకున్న నటి వ్రితిక షేరు ఆ విషయాన్ని బన్నీకి చేరవేసి క్రిస్మస్ సందర్బంగా సమీర్ కోరికను నిజం చేయమని కోరారు.
వేంటనే స్పందించిన బన్నీ తన అభిమాని కోసం స్పెషల్ ప్లానింగ్ చేశారు. తాను సైన్ చేసిన ఆటోగ్రాఫ్ కార్డును ఆ చిట్టి అభిమానికి చేరేలా చేశాడు. అది కూడా తన కుమారుడు అయాన్ ద్వారా కావడం విశేషం. అయాన్ తన తండ్రి సైన్ చేసి ఇచ్చిన కార్డును తీసుకుని ఆశ్రమానికి వెళ్లి అభిమానికి అందజేశాడు. అంతేకాదు ఆశ్రమంలో ఉన్న పిల్లలకు క్రిస్మస్ బహుమతులు కూడ అందించాడు. అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కార్డును అయాన్ వచ్చి అందివ్వడంతో సమీర్ తో పాటు మిగతా పిల్లలు కూడ సప్రైజ్ ఫీలయ్యారు. తమ కోసం ఇంత చేసిన బన్నీకి కృతజ్ఞతలు తెలిపారు.