పవన్ కళ్యాణ్ తన రాజకీయపరమైన కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. అతి కష్టం మీద డేట్స్ కేటాయించి షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఆయన సైన్ చేసిన సినిమాలు మూడు నడుస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలని తొందరలో ఉన్న పవన్ వీలు చిక్కినప్పుడల్లా మధ్యలో పార్టీ పనులు చూసుకుంటూనే ఉన్నారు. షూటింగ్ బ్రేక్ వచ్చినప్పుడు పార్టీ వ్యక్తులను కలవడం, ముఖ్యమైన పేపర్ వర్క్ లాంటివి చేసుకుంటున్నారు. తాజాగా కూడ ‘వకీల్ సాబ్’ షూటింగ్ విరామంలో ఇదే పని చేశారు పవన్.
లాక్ డౌన్ అనంతరం ఒక షెడ్యూల్ ముగించిన టీమ్ ప్రస్తుతం ఇంకొక షెడ్యూల్ అరకులో చేస్తోంది. అందులో పవన్, శృతి హాసన్ పాల్గొంటున్నారు. అరకు అంటే ఆదివాసీలకు, అందమైన అడవీ ప్రాంతానికి నెలవు. పవన్ కు ప్రకృతి, అందులో మమేకమై జీవించే ఆదివాసీలు అంటే చాలా మక్కువ. గతంలో తన ‘తమ్మడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ సినిమాల్లో ఆదివాసీలు, గిరిజనుల పాటలు ఉంచి వారి పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. తాజాగా షూటింగ్ మధ్యలో విరామం దొరకడంతో స్థానిక ఆదివాసీలను నేరుగా కలిసిన పవన్ వారితో కాసేపు సమయం గడిపారు. ఆదివాసీ స్త్రీలు తమ స్థితిగతులను పాట రూపంలో పాడి పవన్ కు వినిపించారు.
పవన్ ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి నిన్న వకీల్ సాబ్ షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన వనవాసి గుర్తుకువచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.